జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
రాజంపేట టౌన్ : మండలంలోని కారంపల్లె జెడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న వరదరాజు వర్షిత అనే విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.ఇందిర బుధవారం విలేకరులకు తెలిపారు. ఇటీవల కృష్ణాజిల్లా గన్నవరంలో జరిగిన రాష్ట్రసాయి రగ్బీ పోటీల్లో వర్షిత విశేష ప్రతిభ కనబరచడంతో క్రీడా అధికారులు జాతీయ స్థాయికి ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. ఒడిస్సాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో తమ పాఠశాల విద్యార్థిని పాల్గొంటుందన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా వర్షిత రాణించాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. ఫిజికల్ డైరెక్టర్ పార్థసారధి క్రీడల్లో ఇస్తున్న తర్ఫీదు వల్లే విద్యార్థులు రాణిస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు పక్కన వృద్ధుడి మృతి
మదనపల్లె రూరల్ : మండలంలోని రామసముద్రంరోడ్డు కొత్తపల్లె సమీపంలో రోడ్డుపక్కన ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఉదయాన్నే రోడ్డుపక్కన ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం విచారించగా, సీటీఎం పంచాయతీ నల్లగుట్టపల్లెకు చెందిన హనుమంతు(75)గా గుర్తించారు. మృతుడికి ఎవరూ లేకపోవడంతో భిక్షాటన కోసం కొత్తపల్లె వైపు వచ్చి రాత్రి వేళ చలికి తాళలేక మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.
రాజంపేట జిల్లా కేంద్రం కోసం ర్యాలీ
రాజంపేట : రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వవిప్, రైల్వేకోడూరు శాసనసభ్యుడు, అరవశ్రీధర్, జనసేన పార్లమెంటరీ నేత యల్లటూరు శ్రీనివాసరాజు, జనసేన నాయకుడు అతికారి వెంకటయ్య, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, సాంస్కృతిక విభాగం ప్రతినిధి పంతగాని నరసింహప్రసాద్, పూల భాస్కర్, లక్ష్మీనారాయణ, సంఘసేవకుడు ఉద్దండం సుబ్రమణ్యం, మైనార్టీ నేతలు అబుబకర్, గుల్జార్‌బాషా, రాజంపేట ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ నవీన్, నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్‌కలెక్టర్ భావనకు వినతిపత్రం అందజేశారు.
ముందస్తు జాతీయ లోక్ అదాలత్ సమావేశం
కడప అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి. యామిని ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మండల న్యాయ సేవా సమితి న్యాయమూర్తులతో వర్చువల్ పద్ధతిలో ఈనెల 13 తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించి బుధవారం ముందస్తు సమావేశం నిర్వహించారు. మండల న్యాయ సేవా సంస్థ న్యాయమూర్తులు జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక


