పోలి చెరువులోకి భారీగా వరద నీరు
రాజంపేట టౌన్: దిత్వా తుపాన్ కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అన్నమయ్య జిల్లా రాజంపేట వద్దనున్న పోలి చెరువులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీనికి తోడు బుధవారం రాత్రి నుంచి వేకువజాము వరకు రాజంపేటలో భారీ వర్షం కురిసింది. దీంతో దాదాపు 60 శాతం మేరకు చెరువులోకి నీళ్లు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. తుపాన్‌కు ముందు పోలి చెరువు ఎండిపోయే దశలో ఉండింది. ఒక్కసారిగా చెరువులోకి నీళ్లు వస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. మండలంలోని అతి పెద్ద చెరువు అయిన పోలి చెరువు నిండి అలుగు పొర్లితే దాదాపు రెండేళ్ల పాటు భూగర్భజలాలు సంవృద్ధిగా ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజులు ఎగువ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసినా పోలి చెరువు నిండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పోలి చెరువులో నీళ్లు వేణుగోపాల స్వామి ఆలయం ప్రహరీకి నాలుగు అడుగుల దూరంలో ఉన్నాయి. పోలి చెరువు నిండుకుండలా చూపరులను కనువిందు చేస్తోంది.


