కోడూరును నిర్లక్ష్యం చేస్తే ఉద్యమిస్తాం
రైల్వేకోడూరు అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలను చిన్నచూపు చూస్తున్నారని.. కోడూరును నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం తప్పదని గురువారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొరముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్ర బాబు అధికారం చేపట్టిన నాటి నుంచి రాజంపేట, రైల్వేకోడూరుపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రాజంపేటలో వైఎస్సార్సీపీ గెలిచిందని కుట్రపూరితంగా జిల్లా విషయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారని తెలిపారు. కోడూరు ప్రజల తరపున రెండు ఆప్షన్‌లు ఇస్తున్నామని జిల్లాకు రాజంపేట కేంద్రంగా ప్రకటించాలని లేదా రైల్వే కోడూరుని తిరుపతిలో కలపాలని డిమాండ్ చేశారు. జిల్లాల విషయంలో చంద్రబాబు, కూటమి ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని తెలిపారు. త్వరలో నిరసనల కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. మూడు నియోజకవర్గాలను జిల్లా చేయడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. మూడేళ్ల క్రితం ఒప్పందం జరిగిన కంపెనీలను తాను తెచ్చినట్లు డప్పు కొట్టుకొంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీమార్కెట్ చైర్మన్ సుబ్బరామరాజు, పట్టణకన్వీనర్ సీహెచ్‌రమేష్, మందలనాగేంద్ర, బుడుగుశివయ్య, నందాబాల, రౌఫ్, ఆంజనేయులు, కరీముల్లా, పుష్పలత, డీవీరమణ, రాజు, శంకరయ్య, రామకృష్ణ, పోతయ్య, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు


