వెల్లివిరిసిన మత సామరస్యం
మదనపల్లె సిటీ : అయ్యప్పమాలధారులకు ముస్లింలు భిక్ష(అన్నదానం) ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు. మదనపల్లె పట్టణం ప్రశాంత్‌నగర్ జ్ఞానోదయ పాఠశాలలో ఆదివారం హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్‌తో పాటు ముస్లిం యువకులు కలిసి అయ్యప్ప మాలధారులకు భిక్ష ఏర్పాటు చేశారు. తొలుత అయ్యప్పస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. హెల్పింగ్‌మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా పవిత్ర అయ్యప్పమాలధారులకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మతసామరస్యంతోపాటు సోదరభావాన్ని పెంపొందించడానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో సభ్యులు ఖాదర్‌ఖాన్, హనీఫ్, సమీర్, సైసవల్లి, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.


