విష పురుగు కాటుతో వ్యక్తి మృతి
పోరుమామిళ్ల : విష పురుగు కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణంలోని కాపువీధిలో జరిగింది. ఎస్‌ఐ కొండారెడ్డి కథనం మేరకు ఈనెల 6 వ తేది రాత్రి 11 గంటల ప్రాంతంలో చిలమల గురయ్య (43) తన ఇంటి ముందు కూర్చొని ఉండగా బొటనవేలు కింద విషపురుగు కాటేసింది. దాన్ని తేలికగా తీసుకుని నిద్రపోయాడు. 7 వ తేదీ ఉదయం కాలు కమిలిపోయి నల్లగా ఉండటంతో భయపడి కడప రిమ్స్‌కు వెళ్లాడు. అక్కడ రక్త పరీక్షలు నిర్వహించి, విషానికి విరుగుడు ఇంజక్షన్ ఇచ్చి చికిత్స చేశారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి గురయ్య మృతి చెందాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు.
అదృశ్యమైన గంటలోపే
ఆచూకీ లభ్యం
ఎర్రగుంట్ల : అదృశ్యమైన విద్యార్థిని గంటలోపే గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. వివరాలు ఇలా.. ఎర్రగుంట్ల పట్టణంలోని రెండవ సచివాలయంలో కవిత ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. ఆమె కుమారుడు సోమచరణ్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కుమారుడు పాఠశాలకు వెళ్లి ఇంటికి రాకపోవడంతో భయ పడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ విశ్వనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా గాలించి గంటలోపే సోమచరణ్‌ను గుర్తించారు. తల్లి కవితను స్టేషన్‌కు పిలిపించి సోమచరణ్‌ను అప్పగించారు.


