అధికార పార్టీ నాయకుల భూ కబ్జా
ఓబులవారిపల్లె : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. వారికి అధికారులు కూడా వత్తాసు పలుకుతుండటంతో అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మండలంలోని పెద్దఓరంపాడు రెవెన్యూ పరిధిలోని వాసుదేవపురం గ్రామానికి సమీపంలో తుమ్మెద గుర్రప్ప అనే రైతుకు చెందిన సర్వే నెంబరు. 2204లో ఉన్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని వాసుదేవపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మహేష్ నాయుడు డోజర్ సహాయంతో చదును చేసి కబ్డాకు పాల్పడ్డాడు. తన వ్యవసాయ భూమిలో ఉలవ, సజ్జ పంటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తన భూమికి సంబంధించి అన్ని రికార్డులు ఉన్నాయని రైతు గుర్రప్ప తెలిపాడు. పది సంవత్సరాల క్రితం మంగంపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పత్రాలతో రెండు లక్షల రుణం కూడా తీసుకున్నానని తెలిపారు. గత ఎన్నికల్లో తన కుమారుడు తుమ్మెద ఈశ్వరయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంటుగా పోలింగ్ బూతులో కూర్జున్నాడని, ఇందుకు తమపై కక్షకట్టి చామలమడుగు మహేష్ నాయుడు అధికార బలంతో తమ పొలాన్ని దౌర్జన్యంగా కబ్జాకు పాల్పడుతున్నాడని, అధికారులు, నాయకులు చర్యలు తీసుకోవాలని రైతు గుర్రప్ప కోరుతున్నారు.


