గిరిజన కుటుంబంపై బీజేపీ నాయకుడు దాడి
మదనపల్లె రూరల్ : వ్యక్తిగత కక్షలను మనస్సులో పెట్టుకుని బీజేపీ నాయకుడు గిరిజన కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. న్యాయం చేయాలని కోరుతూ నక్కలదిన్నె తండా వాసులు తాలూకా స్టేషన్ ఎదుట నిరసనకు దిగిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పట్టణంలోని కురవంక సరస్వతీనగర్‌లో నివాసం ఉన్న రామమూర్తి నాయక్ (39), స్థానికుడైన బీజేపీ నాయకుడు కోసూరి భవానీ మధ్య కొంతకాలంగా మనస్పర్థలు, వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. రామమూర్తి నాయక్‌పై భవానీ చెడుగా ప్రచారం చేస్తుండటంతో గతంలో పలుమార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం రామమూర్తినాయక్, కురవంక వద్ద ద్విచక్రవాహనంలో వస్తుండగా, భవానీ అడ్డుకుని దాడికి పాల్పడ్డాడు. ఈలోగా రామమూర్తినాయక్ భార్య రోజా(32), తల్లి కమలమ్మ(60) అక్కడకు చేరుకుని నిలదీయడంతో వారిపై దాడికి దిగాడు. ఈ విషయాన్ని రామమూర్తి నాయక్, నక్కలదిన్నె తండాలోని తన బంధువులకు తెలపడంతో గిరిజనులు పెద్దసంఖ్యలో తాలూకా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నిందితుడితో వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భవానీని స్టేషన్‌లోనికి తీసుకెళ్లారు. అయితే భవానీ గతంలోనూ పలుమార్లు ఘర్షణకు దిగి దౌర్జన్యం చేసి దాడికి పాల్పడటమే కాకుండా చంపుతానని బెదిరించాడని, స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడం వల్లే తరచూ దాడులకు పాల్పడుతున్నాడని స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. నిందితుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు నిందితుడిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.
పోలీస్ స్టేషన్ ఎదుట
తండా వాసుల నిరసన


