సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త గురిగింజకుంట కొండయ్య నాయుడు (51) మృతి చెందగా భార్య రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంబేపల్లె మండలంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు .. సుండుపల్లె మండలం చిన్నగొల్లపల్లె గ్రామం రామావాండ్లపల్లెకు చెందిన కొండయ్య, భార్య రత్నమ్మ ద్విచక్రవాహనంలో సంబేపల్లె మండలంలోని అన్నప్పగారిపల్లెకు బయలుదేరారు. మార్గమధ్యంలోని మొటుకువాండ్లపల్లె క్రాస్ వద్దకు రాగానే వీరి ద్వి చక్రవాహనాన్ని రాయచోటి వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కొండయ్య నాయుడు అక్కడికక్కడే మృతి చెందగా భార్య రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన భర్తకు ఏమైందంటూ అక్కడికి వచ్చిన వారందరిని ఆమె అడుగుతుంటే సమాధానం చెప్పలేక వారు బాధను దిగమింగడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సంబేపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్యకు తీవ్ర గాయాలు
మృతి చెందిన
కొండయ్యనాయుడు
తీవ్ర గాయాలతో
పడిపోయిన రత్నమ్మ


