నీరుగారుతున్న లక్ష్యం
పెరిగిన వ్యయం..
రాజంపేట: చెయ్యేరు నదిపై ఆనకట్టల నిర్మాణాలు ఎడారిలో ఒయాసిస్‌లా మారుతోంది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వందలాది టీఎంసీల నీరు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి చేరుతోంది. చెయ్యేరులో నీటి ప్రవాహం కొనసాగినా ఫలితం లేకుండాపోతోంది. అలాగే వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల మీదుగా ప్రవాహించే వరదనీటిని ఒడిసిపట్టలేని పరిస్ధితి.
జాడలేని నిపుణుల కమిటీ
గతంలో చంద్రబాబునాయుడు చెయ్యేరులో వరదనీరు వృథా పోకూడదని ఆనకట్టలకు సబంధించి నిపుణుల కమిటీని పంపిస్తామని..తద్వారా వరదనీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిన మాటలు నీటిమూటలగానే మిగిలిపోయాయి. ఇప్పటి వరకు నిపుణుల కమిటీ జాడ కనిపించడంలేదు. వరదల సమయంలో ఏటిలో ప్రవహించే నీరు వృథాగా సోమశిల జలాశయంలో కలిసిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
● రెండున్నర దశాబ్దాలుగా చెక్‌డ్యాంల నిర్మాణంపై కదలిక లేదు. నాడు సీఎంగా చంద్రబాబునాయుడు..నేడు కూడా ఆయనే. అయినా ఫలితం లేదు. వరదల సమయంలోనే పాలకులకు, అధికారులకు ప్రాజెక్టులు ఆనకట్టలు గుర్తుకు వస్తాయి. వరద వచ్చినప్పుడు ఆ నీటిని ఒడిసిపట్టుకోవాలి. తర్వాత చెక్‌డ్యాంల ద్వారా నీరునిల్వ చేసుకుంటే భూగర్భజలాలు ఘననీయంగా పెరిగేందుకు దోహదపడుతుంది. కరువు బారినపడుకుండా రైతులకు సాగునీరు పుష్కలంగా లభిస్తుందని నిపుణులు అంటున్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
చెయ్యేరులో చెక్‌డ్యాంలు నిర్మించాలని చంద్రబాబునాయుడు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ప్రకటించారు.అయితే నేటికీ అమలుకాలేదు. గుండ్లూరు–నీలపల్లె మధ్య ఉన్న లోలెవల్ కాజ్‌వేను చెక్‌డ్యాంగా నిర్మిస్తే చెయ్యేరు హైలెవల్ వంతెనకు ప్రత్యామ్నాయ రహదారిగా ఉంటుంది.దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. –భూమన శివశంకర్‌రెడ్డి,
మాజీ సర్పంచి, మేజర్‌పంచాయితీ,నాగిరెడ్డిపల్లె
చెక్‌డ్యాంలు నిర్మించాలి
వర్షాకాలంలో చెక్‌డ్యామ్‌లు వరద నీటిని నిల్వ చేసి, ఆ నీటిని వ్యవసాయం, తాగునీటి కోసం ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి.అందువల్ల ప్రభుత్వం వెంటనే వీటిని నిర్మించాలి.వరదనీరు వృథా కాకుండా చర్యలు చేపట్టాలి. –పునగాని గుణయాదవ్,
జిల్లా ప్రధానకార్యదర్శి,యూత్‌వింగ్, వైఎస్సార్‌సీపీ
2001లో చెయ్యేరు, పెన్నా, గుంజన నదులకు లక్షల క్యూసెక్కులు వరద పొటెత్తింది. 30టీఎంసీలు వృథాగా పోయింది. ఈ నీటిని నిల్వ చేసుకునేందుకు సబ్ సర్ఫేస్ చెక్‌డ్యాం నిర్మించాలని అప్పటి సీఎం చంద్రబాబుఆదేశించారు.అప్పటి ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య సీఎంను కలిసి ప్రతిపాదనలు ఇచ్చారు. 2002లో నాలుగు సర్పేస్ చెక్‌డ్యాంలు మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఆదేశించారు. సీఎం గ్రామీణాభివృద్ధి, ఇరిగేషన్ అధికారులతో చర్చించారు.
07.07.2003లో నాబార్డు, గ్రామీణాభివృద్ధిశాఖ, నీటిపారుదలశాఖ అధికారులు సమావేశమై హైలెవల్ మానిటరింగ్ కమిటీని తెరపైకి తీసుకొచ్చారు.ఈ కమిటీ రాజంపేట, పెనగలూరు, నందలూరు మండలాల పరిధిలో ప్రవహించే చెయ్యేరు, గుంజన నదులపై నాలుగు సబ్ సర్ఫేస్‌డ్యాంల నిర్మించాలని సూచించింది. దీంతో మైనర్ ఇరిగేషన్ సెక్టార్ కింద రూ.6.45కోట్ల నిధులు మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ నిధులను ఏమయ్యాయో ఇప్పటి వరకు అంతుపట్టడంలేదు.
నీటిపారుదలశాఖ 55 చెక్‌డ్యామ్‌ల నిర్మించేందుకు ప్రాథమిక నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. అప్పట్లో నిపుణుల కమిటీని జిల్లాకు పంపి వరద నీటి గణాంకాలను పరిశీలించి చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ విషయంలో జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటామని బాబు వెల్లడించారు. గతంలో వచ్చిన నిధులను నీటిపారుదలశాఖ వినియోగించుకోక పోవడం వల్ల ఇప్పుడు వ్యయం మూడురెట్లు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చెక్‌డ్యాంల నిర్మాణం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తవుతున్నాయి.
చెక్‌డ్యాంల నిర్మాణంపై కదలిక లేదు
వృథాగా పోతున్న వరదనీరు
సోమశిలలోకి లక్షలాది క్యూసెక్కులు
నాడు బాబే...నేడు బాబే!
అయినా మారని తీరు....
నీరుగారుతున్న లక్ష్యం
నీరుగారుతున్న లక్ష్యం


