బాబు చేతగానితనంతో గాలిలో కలిసిపోతున్న భక్తుల ప్రాణాలు
రాజంపేట టౌన్: చంద్రబాబునాయుడుకు పరిపాలించడం చేతగాక పోవడంతో భగవంతుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోతున్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాఽథరెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఈనెల 1వ తేదీ కార్తీక ఏకాదశిని పురస్కరించుకొని వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాశీబుగ్గ మృతులకు ఆదివారం రాత్రి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ సర్కిల్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈసందర్భంగా విశ్వనాఽథరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయాల్లో భక్తులు మృత్యువాత పడటం ఇది మూడోసారి అన్నారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఆలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే ఈ విషా ఘటన జరిగేది కాదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించేందుకే కూటమి ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని ఆరోపించారు. అందువల్లే రాష్ట్రంలో అత్యాచారాలు, నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాశీబుగ్గ సంఘటనపైనే ప్రజలు మాట్లాడుకుంటూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతున్నారని, దీంతో చంద్రబాబునాయుడు ప్రజల దృష్టిని మరల్చేందుకు మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికై నా కక్షసాధింపు చర్యలపై చూపే శ్రద్ధ పాలనపై, శాంతిభద్రతలపై చూపాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు డీలర్ సుబ్బరామిరెడ్డి, దయానంద, వడ్డే రమణ, రఘురామిరెడ్డి, కౌన్సిలర్ సనిశెట్టి నవీన్‌కుమార్, మిర్యాల సురేఖ, దండు గోపి, ఖాజామొహిద్దీన్, దాసరి పెంచలయ్య, జీవన్, జుబేర్, ఖాజా, మాధవ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


