● కొత్తవి రావు... పాతవి ఉండవు...
రాయచోటి అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఏడాది మే నెలలో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు హామీల మీద హామీలిచ్చారు. అందులో భాగంగా 50 ఏళ్లు నిండిన ఎస్పీ, ఎస్టీ, బీసీ , మైనారిటీలందరికీ వృద్ధాప్య ఫించన్ ఇస్తామని ప్రకటించారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అన్ని ఎన్నికల సభల్లోనూ ఈ హామీని ఊదరగొట్టారు. చంద్రబాబు మాటలను నమ్మి ఓట్లేసిన ప్రజలు అబద్ధపు హామీలు నమ్మి మోసపోయామని వాపోతున్నారు. 50 ఏళ్లకే ఫించన్ వస్తుందన్న హామీని నమ్మి ప్రతి గ్రామంలో ఇప్పటికీ వందలాది మంది అర్హులు ఎదురుచూస్తున్నారు. అయినా కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి అదేశాలు రాకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. కనీసం ఫించన్ మంజూరు ప్రక్రియ కూడా ప్రారంభం కాకపోవండం ఆ అవ్వాతాతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మరో వైపు వికలాంగుల ఫించన్‌ల వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించి వారిని కూడా నానా విధాలుగా ఇబ్బందులకు గురి చేయడం గమనార్హం.
● ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య ఫించన్ ఇస్తామన్న హామీ ఒకటి. అయితే ఈ హామీకి సంబంధించి ఎటువంటి చర్యలు కానీ, జీవోలు కానీ రాకపోవడం అందరినీ నిరుత్సాహ పరిచింది.
అమలు కాని 50 ఏళ్లకే ఫించన్ హామీ
మరో వైపు దివ్యాంగుల ఫించన్ల ఏరివేత
ఆందోళనలో లబ్ధిదారులు
జిల్లాలో కొత్తగా వృద్ధాప్య, వితంతు , వికలాంగుల ఫించన్ల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొత్త ఫించన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు కళ్లుకాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు. అవి మంజూరు కాకపోవడం ఒక ఎత్తయితే ఉన్న ఫించన్లలో కూడా వివిధ కారణాలతో కోతలు విధిస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా వ్యా ప్తంగా గత ఏడాది ఎన్నికల సమయానికి 2.24 లక్షలు ఫించన్లు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత ప్రతి నెలా క్రమం తప్పకుండా ఫించన్లలో కోత విధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ 17 నెలల్లో జిల్లాలో గతంలో ఫించన్లు తీసుకున్న వారిలో చాలా మందికి ిఫించన్ అందలేదని వాపోతున్నారు. జిల్లాలోని 30 మండలాల్లో ఏ ఒక్క మండలంలో కూడా ఈ 17 నెలల్లో ఫించన్లు పెరగకపోవడంతో పాటు, ప్రతి మండలంలో ఫించన్ల కోత జరగడం గమనార్హం . జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేసిన ఫించన్లు 2.07లక్షలుగా ఉండటం బాధాకరం.


