● అమ్మభాష మరువరాదు: హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

● అమ్మభాష మరువరాదు: హైకోర్టు న్యాయమూర్తి

Nov 3 2025 6:58 AM | Updated on Nov 3 2025 6:58 AM

● అమ్మభాష మరువరాదు: హైకోర్టు న్యాయమూర్తి

● అమ్మభాష మరువరాదు: హైకోర్టు న్యాయమూర్తి

● అమ్మభాష మరువరాదు: హైకోర్టు న్యాయమూర్తి

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రాథమిక విద్య తప్పనిసరిగా తెలుగులోనే జరగాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్‌ ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. జానమద్ది శతజయంతి సందర్బంగా ఆదివారం కడపలోని బ్రౌన్‌ గ్రంథాలయం ఎదుట జానమద్ది సాహితీపీఠం మేనేజింగ్‌ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 14వ సాహిత్య, గ్రంథాలయ సేవా పురస్కారాల ప్రదానోత్సవానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ వంటి విద్యలు దేశ భాషల్లోనే సాగాలన్నారు. ఇంగ్లీషులో విద్యాబోధన లేకపోతే భవిష్యత్తే ఉండదనే వాదన సరికాదన్నారు. చైనా, రష్యా, ఫ్రాన్స్‌, జర్మనీల్లో విద్య ఆయా దేశ భాషల్లోనే కొనసాగుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, భారత విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణలతోపాటు తాను కూడా మాతృభాషలోనే చదువుకొని ఎదిగామన్నారు.న్యాయస్థానాల్లో వాద ప్రతివాదాలు, తీర్పులు తెలుగులో సాగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. షాపులు, రెస్టారెంట్ల బోర్డులు తప్పనిసరిగా తెలుగులో ఉండే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యర్తురాలన్నీ తెలుగులో ఉండాలన్నారు. మిగతా భాషలు నేర్చుకోవడానికి తాను వ్యతిరేకం కాదని, అయితే మాతృభాషను విస్మరించరాదన్నారు. మన భాష, ఆహారం, పద్దతులు, సంప్రదాయాలను పాటించాలని సూచించారు. స్వర్ణభారతి ట్రస్టు తరుపున తన కుమార్తె బ్రౌన్‌ గ్రంథాలయ అభివృద్ధి కోసం రూ. 5 లక్షల విరాళాన్ని ఇవ్వనుందని తెలిపారు.

బ్రౌన్‌కు శాశ్వత చిరునామా

సభకు అధ్యక్షతన వహించిన కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బ్రౌన్‌కు శాశ్వత చిరునామా ఏర్పాటుచేసిన ఘనత డాక్టర్‌ జానమద్ది హనుమచ్చాస్త్రికే దక్కుతుందన్నారు. బ్రౌన్‌ గ్రంథాలయ బడ్జెట్‌ ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదని, కనుక గ్రంథాలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌రూ. 50 లక్షలకు పెంచాలన్నారు. బ్రౌన్‌ గ్రంథాలయంలో ఏదో ఒక రాష్ట్ర స్థాయి అకాడమిని ఏర్పాటు చేయాలన్నారు. గ్రంథాలయానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

పురస్కారాల ప్రదానం: రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్‌ డాక్టర్‌ గుమ్మడి గోపాలకృష్ణ, పంచ సహస్రావధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌, ప్రసారభారతి విశ్రాంత అదనపు డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ రేవూరు అనంత పద్మనాభరావు, కర్ణాటక రాష్ట్రంలో 20 లక్షల పుస్తకాలతో సొంతంగా గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న మరె అంకేగౌడలకు ఈ సందర్భంగా జానమద్ది స్మారక సాహిత్య, గ్రంథాలయ సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. చివరగా 2025లో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో అధికమార్కులు సాఽధించిన బాల వికాస్‌పాఠశాల విద్యార్థులు గౌసియా, నీనాసహన, ప్రదీప్‌కుమార్‌, దీపిక, రిహానా హుస్నాలకు వెంకయ్యనాయుడు మెమెంటోలు అందజేశారు. అలాగే గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించిన చిత్రకారుడు ఆనందరాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కడప జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, యోగి వేమన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌, స్టేట్‌ బ్యాంకు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వి.హేమ తదితరులు పాల్గొన్నారు.

అమ్మభాష అయిన తెలుగును మరువరాదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి ప్రతాప అన్నారు. రాబోయే తరాలకు మన సంస్కృతి, వ్యవహారాలు, కట్టుబాట్లు అందించడానికి భాష తోడ్పడుతుందన్నారు. కళలు, భాషా సాహిత్యాలను చరిత్రలో ప్రోత్సహించిన రాజులే నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నారని తెలిపారు. తెలుగు ప్రజల హృదయాల్లో బ్రౌన్‌ చిరస్థాయిగా నిలిచిపోయే కృషి చేసిన జానమద్ది హనుమచ్చాస్త్రి అభినందనీయుడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement