
ప్రతిభకు కౌశల్ !
సద్వినియోగం చేసుకోవాలి
మదనపల్లె సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ‘కౌశల్’2025 పోటీలు దోహదపడుతాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నుంచి కౌశల్–2025 పేరిట రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రతిభ అన్వేషణ పోటీల్లో పాల్గొనేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. భారతీయ విజ్ఞాన మండలి, ఏపీ సైన్స్ సిటీ, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో ఏటా ఈ పోటీలలను నిర్వహిస్తున్నారు.
క్విజ్ పోటీలకు 8,9,10 తరగతుల నుంచి ఒక్కో తరగతికి ముగ్గురు, రెండు నిమిషాల వ్యవధితో కూడిన రీల్స్/ షార్ట్స్ పోటీలకు,పదో తరగతి నుంచి ఇద్దరు, పోస్టర్ తయారీ–1 పోటీలకు 9వ, పోస్టర్–2కు 8వ తరగతి నుంచి ఇద్దరు చొప్పున పాల్గొనాలి. ప్రతిభ కనబరిచిన వారిని ఆయా విభాగాలకు 20 మంది చొప్పున జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. విజేతలను జిల్లా రాష్ట్ర స్థాయిల్లో నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికలు అందజేస్తారు. ఆసక్తిగల విద్యార్థులు పాఠశాల సమన్వయకర్త ద్వారా అక్టోబర్ 24వతేదీలోపు www.bvmap.org వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కౌశల్–2025 డివిజన్ సమన్వయకర్త భాస్కరన్ తెలిపారు. ఈ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8,9,10 తరగతుల విద్యార్థులు అర్హులు. కౌశల్ పోటీలకు 8,9,10 తరగతుల సిలబస్ నుంచి గణితం, ఫిజిక్స్, నేచురల్ సైన్సులపై ఉంటుంది.
క్విజ్ పోటీల్లో...
రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.15వేలు, ద్వితీయ బహుమతిగా రూ.12 వేలు, తృతీయ బహుమతిగా రూ.9 వేలు, ప్రోత్సాహక బహుమతిగా రూ.6 వేలు అందజేస్తారు. జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాలకు రూ.4,500, రూ.3,000, రూ.1,500 నగదు ఇస్తారు.
పోస్టర్ ప్రజంటేషన్‌లో...
రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.5 వేలు, రూ. 3 వేలు, రూ.2 వేలు చొప్పున అందజేస్తారు. కన్సోలేషన కింద రూ.1500 చొప్పున అందజేస్తారు. జిల్లా స్థాయిలో ప్రథమ రూ.1500, ద్వితీయ రూ.1000 ఇస్తారు.
వైజ్ఞానిక లఘ చిత్ర పోటీల్లో ...
వైజ్ఞానిక లఘచిత్ర పోటీల్లో కేవలం 10వ తరగతి విద్యార్థులే పాల్గొనాలి. లఘచిత్రం నిడివి రెండు నిమిషాలు ఉండాలి. రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2వేలు చొప్పున అందజేస్తారు. ప్రోత్సాహక బహుమతికి కింద రూ.1500 ఇస్తారు. జిల్లా స్థాయిలో ప్రథమ రూ.1500, ద్వితీయ రూ.వెయ్యి చొప్పున నగదు బహుమతి అందజేస్తారు.
పరీక్షల తేదీలు:
పాఠశాల స్థాయిలో నవంబర్ 1,3,4 తేదీల్లో, జిల్లా స్థాయిలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు ఉంటాయి
కౌశల్ –2025 పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాలు ప్రోత్సహించాలి. పిల్లల్లో దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు దోహదపడతాయి. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకునేలా ఎంఈఓలు, హెచ్‌ఎంలు కృషి చేయాలి.
– భాస్కరన్, కౌశల్ డివిజన్ సమన్వయకర్త.
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు
పాఠశాల స్థాయి : నవంబర్ 1,3,4 తేదీలు
జిల్లా స్థాయి : 8,9 తరగతులకు నవంబర్
27న, పదో తరగతికి
నవంబర్ 28
రాష్ట్రస్థాయి : డిసెంబర్ 27