
ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించాలి
రాయచోటి : ప్రభుత్వం అందించే సేవలపై వాట్సాప్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ నుంచి ఆయన సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, నీటి పారుదల, హౌసింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాలు, పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన సమస్యల పరిష్కారం, వాట్సాప్ గవర్నెన్స్, జీఓ ఎంఎస్ నంబరు : 30, ప్రజల నుంచి వివిధ అంశాలపై తీసుకున్న ప్రజాభిప్రాయ సేకరణ, జలజీవన్ మిషన్‌కు అవసరమయ్యే భూసేకరణ, రీ సర్వే, చిన్న తరహా నీటిపారుదల, స్వచ్చ ఆంధ్ర తదితర అంశాలపై సమీక్ష చేశారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్‌ఓ మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాయచోటి జగదాంబసెంటర్ : అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీలకు హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య, విద్యా శాఖలు సంయుక్తంగా ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గురువారం ఉదయం 9 గంటలకు డైట్ హాల్‌లో ప్రతిభా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ‘బాలికల హక్కులను కాపాడండి’ ‘లింగ ఎంపిక గర్భస్రావ నిషేధ చట్టం అమలు’ అనే అంశంపై వ్యాసరచన, చర్చ, పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఒక్కొక్క అంశంలో మొదటి బహుమతిగా రూ.5 వేలు, రెండవ బహుమతిగా రూ.3 వేలు, మూడవ బహుమతిగా రూ.2 వేలు బహూకరిస్తారని అన్నారు. ఆసక్తి కలిగిన ప్రభుత్వ విద్యార్థులు పాల్గొనాలని కోరారు.
నేడు నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం
రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలోని జిల్లా నిఘా పర్యవేక్షణ కమిటీ సభ్యులు, సంబంధిత జిల్లా అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు.
నవోదయలో ప్రవేశానికి
దరఖాస్తుల గడువు పెంపు
తిరుపతి సిటీ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, అర్హతలతో పాటు ఇతర వివరాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్–నవోదయ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్, లేదా 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఏఐఏఏఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సత్తార్ ఫైజీ ఎంపిక
కడప ఎడ్యుకేషన్ : ఆలిండియా అదబ్ ఎ అత్ఫాల్ సొసైటీ(ఏఐఏఏఎస్) రాష్ట్ర బాల సాహితీ సొసైటీ అధ్యక్షుడిగా ప్రముఖ ఉర్దూ బాల సాహితీవేత్త సత్తార్ ఫైజీ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన సి. కె. దిన్నె మండలం మూలవంక జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తన ఎంపికపై ఫైజీ సంతోషం వ్యక్తం చేశారు. నవంబర్ 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరం లో జష్నే రంగే బచ్చన్ పేరుతో అంతర్జాతీయ ఉర్దూ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెమినారు, ముషాయిరా, బాల సాహితి ఉర్దూ పుస్తకాల ఆవిష్కరణ, నాటికలు, పుస్తకాల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించాలి

ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించాలి