
వాల్మీకి జీవితం.. ఆదర్శనీయం
రాయచోటి : వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. రాయచోటిలోని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి, వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రామాయణాన్ని 24 వేల శ్లోకాలతో వాల్మీకి రచించారని తెలిపారు. ప్రతి శ్లోకం ఒక సందేశాన్ని తెలియజేసే విధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సురేష్ కుమార్, సోషల్ వెల్ఫేర్ అధికారి దామోదర్‌రెడ్డి, స్టేట్ వాల్మీకి డైరెక్టర్ మండెం ప్రభాకర్, వాల్మీకి జిల్లా అధ్యక్షులు యోగానంద, మదనపల్లి మార్కెట్ యార్డు డైరెక్టర్ శ్యామలమ్మ, జిల్లా వార్డన్ అధ్యక్షులు మనోహర్‌రెడ్డి, వాల్మీకి కుల సంఘం పెద్దలు పాల్గొన్నారు.
రామాయణం స్ఫూర్తితో జీవించాలి
రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కుటుంబ, మానవతా విలువలను పెంపొందించుకొని ధర్మబద్ధంగా జీవించాలని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. వాల్మీకి మహర్షి జీవితం, రామాయణం గొప్పతనంపై ఏఎస్పీ వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ఎం.పెద్దయ్య, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్‌స్పెక్టర్ ఎ.ఆదినారాయణరెడ్డి, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, డీపీఓ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.