
శ్రీగంధం స్మగ్లర్లు అరెస్ట్
బి.కొత్తకోట : మండలంలో శ్రీగంధం చెట్లను నరికి అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో దాడులు జరిపి ఇద్దరిని అరెస్ట్ చేశామని మదనపల్లి అటవీ శాఖ రేంజర్ జయప్రసాదరావు మంగళవారం తెలిపారు. ఆయన వివరాల మేరకు.. బి.కొత్తకోట మండలం మొగసాల మర్రికి చెందిన శ్రీనివాసులు (50), తంబళ్లపల్లె మండలం, ఇట్నేనివారిపల్లికి చెందిన టి.శివకుమార్ (23) లు శ్రీగంధం చెట్లను వ్యవసాయ పొలాల వద్ద నరికి 10 కిలోలను సేకరించారు. పొరుగు రాష్ట్రానికి తరలించేందుకు ఇంటిలో ఉంచగా దాడులు చేసి శ్రీగంధం స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసామని తెలిపారు. ఈ దాడుల్లో హార్సిలీహిల్స్ సెక్షన్ ఆఫీసర్ శివకుమార్, బీటు అధికారులు జయరాం, సుమిత, దేవేంద్రలు పాల్గొన్నారు.
సీఐ మృతి.. ఎస్పీ సంతాపం
రాయచోటి : అనారోగ్యంతో మృతి చెందిన సీఐ జాన్సన్ బాబురావు(45) కుటుంబీకులకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి తన సంతాపం తెలిపారు. ఓ పోలీస్ అధికారిని ఇంత దురదృష్టకర రీతిలో కోల్పోవడం బాధాకరమని, ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు. సీఐ జాన్సన్ బాబూరావు వైఎసార్ కడప జిల్లా ముద్దనూరు వాసి. 2002లో ఎస్‌ఐగా ఉద్యోగంలోచేరి అనంతరం సీఐగా పదోన్నతి పొందారు. ఎస్పీ ఆదేశాల మేరకు ముద్దనూరులోని మృతుడి స్వగ్రామం వద్ద అన్నమయ్య జిల్లా కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్‌స్పెక్టర్ ఎ.ఆదినారాయణరెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది వెళ్లి నివాళులర్పించారు. దహన సంస్కారాల నిమిత్తం లక్ష రూపాయల నగదును మృతుడి సతీమణి ఆశ్రిత మంజూషకు అందజేశారు.
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
ములకలచెరువు : అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం ములకలచెరువులో జరిగింది. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం వడ్డిపల్లికి చెందిన శ్రీరాములు (55) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి అతిగా మద్యం తాగి కదిరి రోడ్డు పక్కన అపస్మారకస్థితిలో పడిపోయాడు. ఉదయం చనిపోయినట్టు స్థానికులు గుర్తించారు.

శ్రీగంధం స్మగ్లర్లు అరెస్ట్

శ్రీగంధం స్మగ్లర్లు అరెస్ట్