
వృద్ధురాలిని కట్టేసి నగల దోపిడీ
చింతకొమ్మదిన్నె : ఒంటరి వృద్దురాలి ఇంట్లోకి చొరబడిన దొంగలు ఆమెను కట్టేసి నగలు దోచుకెళ్లారు. మండల పరిధిలోని కొప్పర్తి గ్రామంలోని రహదారి ప్రక్కనే నివాసముంటున్న కోగటం సరస్వతమ్మ భర్త వెంకట సుబ్బారెడ్డి వీఆర్వోగా పని చేస్తూ ఇటీవల మృతిచెందారు. ఈమె ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు, కుమార్తెకు వివాహమై కడపలో నివాసం ఉంటోంది. దీంతో సరస్వతమ్మ ఒంటరిగా నివాసమయుంటోంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురు యువకులు బైక్‌లో ఆమె ఇంటికి వచ్చారు. పక్కా రెక్కీ నిర్వహించిన దొంగలు ఆమె ఇంటిపై బాడుగకు ఉంటున్న వ్యక్తికి వివాహ పత్రిక ఇవ్వడానికి వచ్చినట్లు నమ్మించారు. పెన్ను ఇస్తే అడ్రస్ రాసి ఇస్తామని అడగ్గా.. సరస్వతమ్మ పెన్ను కోసం వెళ్లింది. ఇంతలో దొంగలు ఆమె వెనుకే వెళ్లి నోరు నొక్కి, చేతులు, కాళ్ళు కట్టేసి బెడ్ రూములోకి లాక్కెళ్లారు. అరిస్తే చంపేస్తాం అంటూ బెదిరించారు. ఆమె మెడలోని బంగారు చైన్, చేతి గాజులు, ఉంగరాలు, చెవి కమ్మలు బలవంతంగా లాక్కుని, బీరువా, అల్మారా తెరిచి అందులోని, బంగారు నగలు, నగదు దోచుకున్నారు. మొత్తం పది తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు, విలువైన వస్తువులు తీసుకెళ్లినట్లు వృద్ధురాలు తెలిపారు. కొంతసేపటికి కట్లు విప్పుకొని గట్టిగా అరవడంతో చుట్టు ప్రక్కల వారు వచ్చి సపర్యలు చేశారు. బంధువులతో వచ్చి పోలీసులకు సమాచారం తెలిపారు. డీఎస్పీ స్పందించి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో వచ్చి పరిశీలించారు. చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి, ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డిని సంప్రదించగా ముగ్గురు వ్యక్తులు కలిసి దోపిడీ చేసినట్లు ఫిర్యాదు అందించని, నేరం చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
పట్టపగలే ముగ్గురు దొంగల నిర్వాకం