
విద్యార్థిపై దాడిపై విచారణ
● కంటి చూపు కోల్పోయిన విద్యార్థి
● నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం
● ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు
లక్కిరెడ్డిపల్లి : తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తపేట సమీపంలోని గట్టు గ్రామ పంచాయతీ గట్ల వద్ద ఏర్పాటైన రిషీ వాటిక గురుకుల పాఠశాలలో విద్యార్థిపై జరిగిన దాడిపై మదనపల్లి–2వ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట గ్రామ పంచాయతీ కలాడివాండ్లపల్లికి వారు సోమవారం చేరుకుని విద్యార్థి కొండా శేషాద్రిరెడ్డి, వారి కుటుంబ సభ్యులను విచారణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి శేషాద్రిరెడ్డి తండ్రి అమరనాథరెడ్డి సీఐ రాజారెడ్డికి వివరాలు వెల్లడించారు. వేదవ్యాస్ భారతి ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే రిషీ వాటిక గురుకులంలో బోధనేతర సిబ్బందిగా పని చేస్తున్న ఆర్.వెంకటేష్ అనే వ్యక్తి విద్యార్థి తండ్రి అమరనాథరెడ్డికి ఒక లక్ష ఫీజు చెల్లించాలంటూ ముందుగా తెలియజేశారు. రెండు రోజులు ఆలస్యం అవ్వడంతో.. విద్యార్థి శేషాద్రిరెడ్డిపై వెంకటేష్ రాయితో కొట్టడంతో కన్నుపై పడి.. కంటి నుంచి రక్తస్రావం అయినట్లు తెలిపారు. విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో పాఠశాల సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా సొంత వైద్యం చేయడంతో.. కుడి కన్నులోని రెటినా పూర్తిగా జారిపోయి దెబ్బతిన్నట్లు గమనించి.. తండ్రి అమరనాథరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారన్నారు. హుటాహుటిన తిరుపతిలోని ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ చేయించారన్నారు. తర్వాత స్వగ్రామం అయిన లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట గ్రామం కాలాడివాళ్లపల్లికి తీసుకొచ్చామన్నారు.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
సెప్టెంబర్ 7న విద్యార్థిపై దాడి చేయగా అదే నెల 14న విద్యార్థి శేషాద్రిరెడ్డి, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బి.కొత్తకోట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్కడి పోలీసులు ఆ పాఠశాల యాజమాన్యంతో కుమ్మకై వెంకటేష్‌పై మాత్రమే కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటి వరకు ఆ పాఠశాల యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంకటేష్‌ను గానీ అరెస్టు చేయలేదన్నారు. ఈ తంతు ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాల యాజమాన్యంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతోపాటు డీజీపీ, హోం శాఖ సెక్రటరీ, హోం మంత్రి, ఉమెన్ మినిస్ట్రీ సెంట్రల్‌కు ఫోన్ ద్వారా తెలపడంతోపాటు వాట్సాప్ ద్వారా కంప్‌లైంట్ ఇవ్వడం, నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్)కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ ఫిర్యాదును ఏమాత్రం పట్టించుకోకుండా నిందితుడు వెంకటేష్, పాఠశాల యాజమాన్యాన్ని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం స్టేట్, సెంట్రల్ వారికి తప్పుడు సమాచారం అందిస్తూ కేసును తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు.
న్యాయం చేయాలి
ఇంతటితో ఈ కేసు వదిలేయకపోతే మీ కుటుంబం మొత్తాన్ని లేపేస్తామని అదే పాఠశాలలో చదువుకునే మరొక విద్యార్థి తండ్రి పాఠశాల తరఫున వంత పాడుతూ కాలాడివాండ్లపల్లికి వచ్చి చెప్పినట్లు తెలిపారు. తన బిడ్డకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో ఏ బిడ్డకు జరగకూడదనే ఉద్దేశంతో కేసును ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విచారణ పేరుతో మదనపల్లి నుంచి వచ్చిన సీఐ గోపాల్‌రెడ్డి విద్యార్థి శేషాద్రిరెడ్డిని ఇంట్లో నుంచి బయటికి బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేయగా.. విద్యార్థి భయభ్రాంతులకు గురై కుప్పకూలిపోయినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలను స్థానికులు వీడియోలు తీయడంతో.. చాటుమాటుగా డ్రస్ మార్చుకునే ప్రయత్నం చేసి అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా ఆ పాఠశాల యాజమాన్యం, వెంకటేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని విన్నవించారు.

విద్యార్థిపై దాడిపై విచారణ