
గౌరవ వేదన!
ముస్లింలపై కూటమి సర్కారు చిన్నచూపు
ఇమామ్, మౌజన్లకు అందని గౌరవ వేతనాలు
11 నెలలుగా చెల్లించని సర్కారు
మదనపల్లె సిటీ: మైనార్టీల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించింది. ముస్లింలను భక్తిమార్గంలో నడిపే ఇమామ్‌లు, మౌజన్లకు భుక్తి లేకుండా చేస్తోంది. గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోంది. దాదాపు 11 నెలలుగా గౌరవవేతనం చెల్లించడం లేదు. మసీదు నిర్వహణ నిధులు మాటే మర్చిపోయింది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మసీదులకు సొంతంగా ఆదాయం ఉండదు. వాటిని నిర్వహించే ఇమామ్‌లు, మౌజన్లు ప్రతి నెలా ప్రభుత్వమిచ్చే గౌరవ వేతనాలపైనే ఆధారపడతారు.
కూటమి కక్ష సాధింపు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి వరకు ఇచ్చిన వేతనాన్ని రెట్టింపు చేసి, ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు చొప్పున ప్రతి నెలా పంపిణీ చేసేవారు. 2024 ఎన్నికల నోటిఫికేషన్‌తో కోడ్ అడ్డురాగా అప్పట్లో 3 నెలల గౌరవ వేతనం పెండింగ్‌లో పడింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అందరు ఒత్తితి చేయడంతో ఇప్పటి దాకా ఆరు నెలలు మాత్రమే గౌరవ వేతనం ఇచ్చి చేతులు దులుపుకుంది. ముస్లింలపై నిర్లక్ష్య వైఖరిని అవలంభించే కూటమి నాయకులు, 11 నెలలుగా గౌరవ వేతనం మంజూరు చేయడం లేదు. దీంతో వారు ఆర్థికంగా నలిగిపోతున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఉండగా ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది తలెత్తలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తుంటే ..దాదాపు 11 నెలల నుంచి గౌరవవేతనం బకాయిలు ఉన్నాయంటే మసీదుల విషయంలో వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. చిన్న కార్యక్రమాలకు రూ. కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తుండగా మసీదు నిర్వహణ మాత్రం భారంగా మారడం దారుణం. షాదీతోఫా పేరుతో రూ.లక్ష ఇస్తామన్న హామీని కూడా తుంగలో తొక్కారు. జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, రాజంపేట, పీలేరు, కలకడ, కలికిరి తదితర ప్రాంతాల్లో సుమారు 380 మసీదులు ఉండగా సుమారు 760 మంది ఇమామ్‌లు, మౌజాన్‌లు పని చేస్తున్నారు.
జిల్లాలోని మసీదులు: 380
ఇమామ్‌లు, మౌజాన్లు: 760 మంది
గౌరవవేతనాలు మంజూరు చేయాలి
ఇమామ్‌లు,మౌజన్‌లకు 11 నెలలుగా గౌరవవేతనం మంజూరు చేయకపోవడం దారుణం. కూటమి ప్రభుత్వం తీరుతో వారంతా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం లేని మసీదుల నిర్వహణ కష్లంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బందులు లేవు.తక్షణమే ఇమామ్, మౌజన్లకు గౌరవవేతనం మంజూరు చేయాలి. – నిస్సార్ అహ్మద్, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మదనపల్లె