
కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
మదనపల్లె రూరల్ : కారు ఢీకొని ఇద్దరికి గాయాలైన సంఘటన శనివారం జరిగింది. తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డికి చెందిన శశిధర్‌రెడ్డి(23), కిరణ్‌కుమార్‌రెడ్డి(25) ఇద్దరూ మదనపల్లె నుంచి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో బి.కొత్తకోట మండలం శీతోళ్లపల్లె స్టాప్ వద్ద కారు ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పీలేరులో చోరీ
పీలేరు రూరల్ : పీలేరు పట్టణం తిరుపతి రోడ్డు మార్గంలోని జర్నలిస్టు కాలనీలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక జర్నలిస్టు కాలనీలో ఉంటున్న యు. రాజేష్ విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటిలో ఎవరూ లేని విషయం తెలుసుకున్న దుండగులు తలుపు పగుల గొట్టి ఇంటిలోకి చొరబడ్డారు. ఇంటిలో వెండి వస్తువులు, నాలుగు పట్టుచీరలు, రూ. 20వేలు నగదు, జత కమ్మలు, జత గాజులు కలిపి సుమారు 25 గ్రాముల బంగారు నగలతో ఉడాయించారు. శనివారం ఉదయం ఇంటిలో జరిగిన సంఘటన గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ యుగంధర్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వేలిముద్ర నిపుణులు ఆధారాలు సేకరించారు.
రాయచోటి జగదాంబసెంటర్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 13 బీసీ స్టడీ సర్కిళ్లలో పని చేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇడగొట్టు నాగేశ్వరరావు కోరారు. శనివారం రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ స్టడీ సర్కిళ్లను నమ్ముకొని పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ దినసరి కూలీలు, పేద మధ్య తరగతి ఉద్యోగులందరికీ అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలన్నారు. 2022 పీఆర్‌సీ ప్రకారం జీతభత్యాలను పెంచాలని, పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచాలని కోరారు. శిక్షణ పొందే అభ్యర్థులకు రూ.1500 నుండి రూ.4500లకు శిక్షణ భృతి పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణం
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణోత్సవం శనివారం వైభవంగా జరిగింది. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలోని కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేసి, విశేష పూజలు చేపట్టారు. అనంతరం వేదపండితులు మంత్రోచ్చారణతో కల్యాణ క్రతువు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కనులారా దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి, సిద్ధాంతి ఇడమకంటి జనార్దన శివాచార్య, పూర్వపు మఠాధిపతి కుటుంబ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

కారు ఢీకొని ఇద్దరికి గాయాలు