
టీ తాగుతూ చర్చించుకుందాం
రాయచోటి జగదాంబసెంటర్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్.సూర్యనారాయణ టీ తాగుతూ చర్చించుకుందాం కార్యక్రమాన్ని ప్రారంభించారని ఏపీజీఏ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి.లక్ష్మీప్రసాద్ తెలిపారు. రాయచోటి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డా.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్‌సీ, డీఏ బకాయిల విషయం ప్రభుత్వం పట్టించుకోలేదని, మూడేళ్ల సరెండర్ లీవ్స్ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడచినా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సుమారు రూ.25 వేల కోట్ల బకాయి ఉందని ఈ మొత్తాన్ని ఎలా తీరుస్తారో అర్థం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్‌బాబు, మోహన్‌బాబు, ఎంపీడీఓ రామచంద్ర, తహసీల్దార్ ఎంవీ.సుబ్రహ్మణ్యంరెడ్డి, రాజా, ఉద్యోగులు పాల్గొన్నారు.