
కుప్పం వెళ్దామా వద్దా!
మదనపల్లె: హంద్రీ–నీవా కుప్పం డివిజన్ కార్యాలయం మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయంలోనే నిర్వహిస్తున్న విషయాన్ని ‘కదలరు.. వదలరు’ శీర్షికన సాక్షిలో ఇటీవల కథనం ప్రచురితం కావడం తెలిసిందే. ఈ కథనంతో ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా నడిచిపోతున్న డివిజన్ వ్యవహారం వెలుగులోకి రావడం, కుప్పం ఈఈ మదనపల్లెలో ఉంటున్న విషయం మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి వెళ్లడంతో.. ఇప్పుడు ఈ సమస్యపై ఎలా ముందుకు వెళ్లాలన్న సందిగ్ధం అధికారుల్లో నెలకొంది. సాక్షి కథనం మంత్రి నిమ్మల, ఈఎన్‌సీ దృష్టికి వెళ్లినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇక డివిజన్ కుప్పానికి తరలించాల్సిన పరిస్థితి తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికారులు కూడా ఇకపై కుప్పం నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుందని కింది స్థాయి ఉద్యోగులకు చెబుతున్నట్టు తెలిసింది. లేదా కుప్పం డివిజన్ కార్యాలయం ప్రారంభించి అక్కడ ఒక బోర్డు పెట్టి డివిజన్‌ను కుప్పానికి తరలించినట్టు చెప్పే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడ ఒకరిద్దరు సిబ్బందిని ఉంచి.. మదనపల్లె నుంచే విధులు నిర్వహించుకోవచ్చన్న అభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఇలా ఉండగా కుప్పం డివిజన్ ఎట్ మదనపల్లె పేరుతో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలని ఉన్నతాధికారులకు కొందరు సూచన చేసినట్టు తెలిసింది. ఇలా ఉత్తర్వు తెచ్చుకుంటే మదనపల్లె నుంచి కుప్పానికి వెళ్లి విధులు నిర్వహించే పరిస్థితి ఉండదని ఎత్తుగడ వేసినట్టు కార్యాలయ వర్గాలు చర్చించుకొంటున్నాయి. ముఖ్యంగా సీఎం నియోజకవర్గానికి మంజూరైన డివిజన్‌ను మదనపల్లెలో ఉండేలా.. ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఏ మాత్రం ఉండదని మరికొందరు స్పష్టంగా చెబుతున్నారు.
సాక్షి కథనంతో అధికారుల మల్లగుల్లాలు