
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడి అమానుషం
రాయచోటి: ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై జరిగిన దాడి అమానుషమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీపై దాడి చేయడం ఎంత వరకు న్యాయసమ్మతమని గురువారం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లే ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చేతులు ఎత్తేయడం, ఓ డీఐజీ స్థాయి అధికారి సంఘటనను పత్తి వ్యాపారంగా అభివర్ణించడం ప్రజాస్వామ్య విలువలను దిగజార్చుతోందన్నారు. గ్రామంలో వాహనాన్ని అడ్డగించి ధ్వంసం చేయడం, బీసీ వర్గానికి చెందిన రమేష్ యాదవ్‌పై, అలాగే వేల్పుల రాము అనే వ్యక్తిపై దాడులు చేయడం అధికార పార్టీ దౌర్జన్యానికి అద్దం పడుతోందన్నారు. రమేష్ యాదవ్‌ను ఫోన్‌లో పరామర్శించినప్పుడు దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పడం తనను బాధించిందన్నారు. రమేష్ యాదవ్‌పై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడుల వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రక్షణ చట్టం ఏమైంది?
బీసీలకు రక్షణ చట్టం తెస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీసీలు దాడులకు గురి కావడం విచారకరమన్నారు. 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఆలోచన చేయడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం బీసీ మహిళలకు అందించిన చేయూత, ఆసరా పథకాలను ఎత్తివేసి మోసగించారన్నారు. మగ్గం ఉన్న చేనేతలకు క్రమం తప్పకుండా ఏటా రూ.24 వేలను జగన్ ప్రభుత్వం అందించేదన్నారు. చేనేతలకు ఈ పదునాలుగు నెలలలో ఏ పథకం అందివ్వలేదన్నారు. గత ప్రభుత్వంలో చేనేతలకు మెటీరియల్ కొనుగోళ్లకు ఏడాదికి అందించిన రూ. 24 వేల స్థానంలో రూ.50 వేలు అందించే ఏర్పాట్లు చేయాలని, దానిపై ఆలోచనలు చేయకుండా బీసీలపైన దాడులు చేసి తీవ్రంగా గాయపరచడం దుర్మార్గమన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్‌రెడ్డి