ప్రచారంలో టీడీపీ వర్గీయుల రగడ | - | Sakshi
Sakshi News home page

ప్రచారంలో టీడీపీ వర్గీయుల రగడ

Aug 8 2025 7:59 AM | Updated on Aug 8 2025 7:59 AM

ప్రచారంలో టీడీపీ వర్గీయుల రగడ

ప్రచారంలో టీడీపీ వర్గీయుల రగడ

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అభ్యర్థిని ఎంపిక చేసిన తరువాత.. అందరూ కలిసికట్టుగా ఎంపిక చేసిన అభ్యర్థి అని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు ఒక పక్క ప్రకటించారు. కానీ అది కేవలం పార్టీ పరువు కాపాడుకునేందుకే అభ్యర్థిని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అందరూ కలిసి అభ్యర్థి విజయానికి కృషి చేయాల్సింది పోయి.. వర్గ విభేదాలను మనసులో ఉంచుకుని సందర్భంగా వచ్చినప్పుడల్లా ప్రదర్శిస్తున్నారు. గురువారం మండల పరిధిలోని దవంతరపల్లిలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, కల్లుగీత కార్మిక సంఘం మాజీ డైరెక్టర్‌ కొమర వెంకట నరసయ్య, మండల టీడీపీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి వాగ్వాదానికి దిగారు. పూర్తి విరాల్లోకి వెళితే.. వీరిలో వెంకటనరసయ్య మేడా విజయశేఖర్‌రెడ్డి వర్గం అయితే నరసింహారెడ్డి చమర్తి జగన్‌మోహన్‌రాజు వర్గం. వీరి మధ్య గత కొంత కాలంగా వర్గ విభేదాలు నడుస్తూ ఉండేవి. ఈ క్రమంలో ఒక రోజు కొమర వెంకట నరసయ్య సామాజిక మధ్యమంలో నరసింహారెడ్డిపై వార్డు మెంబర్‌గా గెలవలేని వ్యక్తిని మండల అధ్యక్షుడిగా చేశారంటూ ఘాటుగా విమర్శించారు. అంతే కాదు కొంత కాలం నరసింహారెడ్డి సుగవాసి వర్గంలో కూడా పని చేశారు. కానీ అప్పుడు వెంకట నరసయ్య జగన్‌మోహన్‌రాజు వర్గంలో ఉన్నారు. ఆ సమయంలో ఒంటిమిట్ట పంచాయతీలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో నరసింహారెడ్డిని, ఆయన అనుచరులను వెంకట నరసయ్యతోపాటు ఆయన అనుచరులు ఒంటిమిట్ట పంచాయతీకి సంబంఽధించిన రెవెన్యూ సదస్సులో పక్క ఊరి వారికి ఏం పని ఉందని అసభ్య పదజాలంలో దూషించారు. ఇది ఇలా ఉంటే ఏమైందో తెలియదు సుగవాసి టీడీపీపై అసంతృప్తితో పార్టీకి ఆయన రాజీనామాచేసి వైఎస్సార్‌సీపీలో చేరడంతో సుగవాసి వర్గంలో ఉన్న నరసింహారెడ్డి జగన్‌మోహన్‌రాజు వర్గంలో చేరారు. అది ఇష్టంలేని వెంకట నరసయ్య.. జగన్‌మోహన్‌రాజు వర్గాన్ని వీడి మేడా విజయశేఖర్‌రెడ్డి వర్గంలో చేరారు. ఇవ్వన్ని మనసులో పెట్టుకున్న నరసింహారెడ్డి సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు.. గురువారం మండల పరిధిలోని దవంతరపల్లిలో జరిగే ప్రచారానికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌ వస్తున్నాడని తెలిసి వెంకట నరసయ్య అక్కడికి వెళ్లాడు. అది చూసిన నరసింహారెడ్డి అతనికి జరిగిన అవమానాలన్నీ గుర్తుకు తెచ్చుకుని కోపోద్రిక్తుడై వెంకట నరసయ్యతో.. ‘నిన్ను ఎవ్వడు ఇక్కడికి రమ్మన్నాడు, ఏ ఊరి నీది’ అని అవమానంగా మాట్లాడాడు. దీంతో అవమానం భరించలేక వెంకట నరసయ్య నరసింహారెడ్డికి ఎదురు తిరిగాడు. ఇద్దరి మధ్య అసభ్య పదజాలంతో మాటల యుద్ధం జరిగింది. ఇది చూసిన ప్రజలు ఇదేం విడ్డూరం అంటూ నోరు వెళ్లబెట్టి చూస్తూ ఉండి పోయారు. ఈ ఘటన ఎంత వరకు దారి తీస్తుందోనని మండల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒంటిమిట్టలో భగ్గుమన్న విభేదాలు

జగన్‌మోహన్‌రాజు, మేడా విజయశేఖర్‌రెడ్డివర్గీయుల మాటల యుద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement