
బిడ్డకు తల్లి పాలే శ్రేయస్కరం
రాయచోటి: పుట్టిన బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకు తల్లి పాలే శ్రేయస్కరమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా గురువారం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖలో పని చేసే క్షేత్రస్థాయి సిబ్బంది.. ప్రతి గర్భిణి సీ్త్రకి, ప్రసవించిన ప్రతి తల్లికి, వారి ఇంటిలోని కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘తల్లి ముర్రుపాలు.. బిడ్డకు మొదటి టీకా’ పోస్టర్స్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో జీఎస్‌డబ్ల్యూ లక్ష్మీపతి, ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్ట్ కోటేశ్వరీ, ఐసీడీఎస్ పీడీ హైమావతి, సీడీపీఓలు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.
ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందివ్వాలి
ప్రజలు సంతృప్తి చెందేలా అధికారులు, సిబ్బంది సేవలందివ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్వర్ణాంధ్ర పి–4 కార్యక్రమం, ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్‌ఓ మధుసూదన్‌రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.