మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దమండ్యం మండలం కలిచెర్ల పంచాయతీ గుర్రంవాండ్లపల్లెకు చెందిన పూజిత(18), తన అక్క కుమార్తె కోమలి(5)తో కలిసి ద్విచక్రవాహనంలో మదనపల్లెకు బయలుదేరింది. మార్గమధ్యంలో కురబలకోట మండలం ముదివేడు క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అదే విధంగా ములకలచెరువుకు చెందిన పెయింటర్ వెంకటరమణ భార్య శాంతమ్మ(45) అనారోగ్యం కారణంగా చికిత్సకై కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంలో మదనపల్లె ఆస్పత్రికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో వేపూరికోట వద్ద ఆమె చీర కొంగు బైక్ వెనుకచక్రంలో చిక్కుకుని కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు