
స్కూల్ వ్యాన్ కిందపడి బాలుడు దుర్మరణం
నిమ్మనపల్లె : ముద్దుముద్దుగా మాట్లాడుతూ బడికి వెళ్లిన పసివాడు.. ఇంటికి చేరకుండానే అనంత లోకాలకు చేరాడు. రోజూ తాను ప్రయాణించే స్కూల్ వ్యాన్ రూపంలో బాలుడిని మృత్యువు బలితీసుకుంది. నిమ్మనపల్లె మండలంలో గురువారం ఈ సంఘటన జరిగింది. మండలంలోని వెంగంవారిపల్లె పంచాయతీ పాత కొండసానివారిపల్లెకు చెందిన మల్లికార్జున, శ్రావణి దంపతుల కుమారుడు దివాకర్(4) నిమ్మనపల్లె విజయవాణి స్కూల్‌లో నర్సరీ చదువుతున్నాడు. పాఠశాల ముగిసిన అనంతరం స్కూల్ వ్యాన్‌లో ఇంటికి బయలుదేరాడు. పాతకొండసానివారిపల్లె వద్ద విద్యార్థులను తల్లిదండ్రులు వ్యాన్ నుంచి కిందకు దించారు. బస్సు దిగిన దివాకర్ వెనుక నుంచి కాకుండా నిలిచి ఉన్న బస్సు ముందువైపు నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించని డ్రైవర్ వాహనాన్ని ముందుకు నడపడంతో దివాకర్ వ్యాన్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు నిమ్మనపల్లె పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. స్కూల్ వ్యాన్‌లో అటెండర్ లేకుండా డ్రైవర్ ఒకడే విద్యార్థులను తీసుకురావడంతో ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మనపల్లె పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.