మదనపల్లె రూరల్ : యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ అన్సర్ బాషా తెలిపారు. పట్టణంలోని శెట్టివారివీధికి చెందిన ఓ యువతి(17) ఈ నెల 4వ తేదీన ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండాపోయింది. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం యువతి తండ్రి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
ప్రమాదంలో
గాయపడిన వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందినట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. ఈ నెల 3న మండలంలోని వేంపల్లె హరిజనవాడకు చెందిన వెంకటస్వామి కుమారుడు శంకర వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. చీకల బైలు పంచాయతీ దారువారిపల్లె వద్ద ఐచర్ వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కేసు విచారణ చేస్తున్నామన్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
ఓబులవారిపల్లె : మండలంలోని చిన్నఓరంపాడు సమీపంలోని కల్వర్టు వద్ద గురువారం సాయంత్రం మినీ లారీ బోల్తా కొట్టింది. మినరల్ వాటర్ బాటిళ్ల లోడుతో తిరుపతి వైపు వెళ్తూ డ్రైవర్ లారీని అతివేగంగా నడిపాడు. మలుపు వద్ద బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఎవరికీ ఏమి కాలేదు. లారీలో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీయగా అతని భయంతో పారిపోయాడు. ఎస్‌ఐ మహేష్ నాయుడు, సిబ్బంది ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
టీటీడీ అధికారుల తీరుపై భక్తుల నిరసన
ఒంటిమిట్ట : రాష్ట్ర దేవాలయంగా గుర్తించిన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థాంలో భక్తులు రామనామ స్మరణ చేస్తున్న సమయాన మైక్ కట్ చేసి అశ్రద్ధగా, అవమానకరంగా వ్యవహరించిన టీటీడీ అధికారుల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీ విజయ శంకరస్వామి అన్నారు. ఈ చర్యకు నిరసనగా గురువారం ఉదయం 11 గంటలకు దేవస్థానం ఎదుట భక్తులు భారీగా గుమిగూడి రామనామ స్మరణ నిర్వహించారు. ఈ అవమానానికి భజన భక్తులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. భక్తులను అవమానించే విధంగా ఆలయ అధికారుల తీరును నిరసిస్తూ.. భక్తులు రామనామమే రక్ష అంటూ ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. భక్తి భావాలకు టీటీడీ అధికారులు అవమానం కల్గించకూడదని వారు స్పష్టం చేశారు.
గడువు పొడగింపు
కడప ఎడ్యుకేషన్ : నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆగష్టు 13వతేదీ వరకూ గడువు పొడగించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. 2025–26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.