
ఇన్‌స్పైర్ నామినేషన్లు సమర్పించండి
రాయచోటి: ఇన్‌స్పైర్ మనాక్ అవార్డుల కోసం అధిక సంఖ్యలో నామినేషన్లు సమర్పించి అన్నమయ్య జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం సైన్స్ ఉపాధ్యాయులకు సూచించారు. రాయచోటి పట్టణంలోని డైట్ హాల్‌లో గురువారం జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజనల్ స్థాయి ఇన్‌స్పైర్ మనాక్ శిక్షణ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. స్థానిక సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రాజెక్టులను రూపొందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మండలి విభాగం, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్ మనాక్ అవార్డుల కోసం 6–12 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనేలా చూడాలన్నారు. నామినేషన్లను జాతీయ స్థాయిలో పరిశీలించి అత్యుత్తమ అన్వేషణాత్మక ఆలోచనలను ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపిక చేస్తారన్నారు. అవార్డుకు ఎంపికై న ఒక్కొక్క విద్యార్థికి రూ.10 వేలు అందిస్తారన్నారు. వీరికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రాజెక్టుకు మేధోసంపత్తి హక్కులు ఇస్తారన్నారు. రాయచోటి డివిజన్ పరిధిలోని 11 మండలాల నుంచి సైన్స్ ఉపాధ్యాయులు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డైట్ సీనియర్ లెక్చరర్ మడితాటి నరసింహారెడ్డి, రాజంపేట మండల విద్యాశాఖ అధికారి సుబ్బరాయుడు, సెక్టోరియల్ అధికారి జనార్ధన్, రీసోర్స్ సభ్యులు సెట్టెం ఆంజనేయులు, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.