
ఎరువు నిల్వలపై ఆందోళన వద్దు
ఒంటిమిట్ట : జిల్లాలో ఎరువు నిల్వలు ఉన్నాయని.. రైతులు ఆందోళన పడవద్దని వ్యవసాయ శాఖ జేడీఏ చంద్రానాయక్ అన్నారు. మండలంలోని రాచపల్లి రైతు సేవా కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలలోనేగాక ప్రైవేటు డీలర్ల వద ఎరువు అందుబాటులో ఉందన్నారు. కాంప్లెక్స్, యూరియా కలిపి వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. వరిపంటకు యూరియా 90 కేజీలు చొప్పున రెండు దపాలుగా వేస్తే సరిపోతుందని, అదనంగా యూరియా వాడటంతో నష్టం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో జయలక్ష్మి, అమరావతి, వంశీ, రైతులు పాల్గొన్నారు.
చోరీకి యత్నం.. దొంగకు దేహశుద్ధి
రాజుపాళెం : పట్ట పగలే రహదారి పక్కనే ఉన్న ఇంట్లో ఓ దొంగ చోరీకి యత్నించగా.. గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన రాజుపాళెం మండలం టంగుటూరులో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు. కానగూడూరు ప్రధాన రహదారిలోని ఉంటున్న రైతు నంద్యాల వెంకట సుబ్బయ్య గ్రామానికి దూరంగా ఉన్న సచివాలయం వద్ద పని నిమిత్తం వెళ్లారు. తిరిగి ఇంటికి చేరుకోగా అప్పటికే ఇంటి తలుపులు మూసివేసి దుండగుడు ఇంట్లో ఉన్న ఇనుప బీరువా పగలగొట్టే పనిలో కనిపించారు. రైతు వెంకటసుబ్బయ్యను చూసి దుండగుడు ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. రైతు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా వచ్చి దుండగుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాలైన వెంకట సుబ్బయ్యను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ప్రొద్దుటూరు రూరల్ సీఐ బాల మద్దిలేటి, ఎస్‌ఐ వెంకటరమణ పరిశీలించారు. చోరీకి పాల్పడిన దుండగుడు దూవ్వూరు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి, షేక్ మహమ్మద్ రఫీగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
తాళ్లపాకలో వరలక్ష్మీవ్రతం
రాజంపేట : పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతంను ఘనంగా నిర్వహించనున్నట్లు తాళ్లపాక టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ ఇక్కడి విలేకర్లకు తెలిపారు. ఈ వ్రతంలో పాల్గొనే మహిళలకు అమ్మవారి కుంకమ, గాజులు, పసుపుదారం, కంకణాలు ఉచితంగా అందజేస్తామన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ వ్రతం నిర్వహిస్తామన్నారు. రాజంపేట పరిసర ప్రాంతాల మహిళలు విశేష సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
బాల్ పురస్కార్‌కు దరఖాస్తుల ఆహ్వానం
రాయచోటి టౌన్ : ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ సాధికారత అధికారి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు (31 జూలై 2025) లోపు పిల్లలు ఈ దరఖాస్తులు చేసుకోవచ్చున్నారు. ఆదర్శవంతమైన పనులు, జాతీయ స్థాయిలో క్రీడలు ఆడటం, సంఘ సేవ, సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, ఆర్ట్స్, లలిత కళలు, వినూత్నమైన సేవలు అందించిన వారు దీనికి అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 15వ తేది లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
10న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక
రాజంపేట రూరల్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ నెల 10వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్‌నాయుడు తెలియజేశారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో గురువారం బీజేపీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన రాయచోటిలో 10న మాధవ్ చేపట్టే కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.