
ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు: ఎస్పీ
కడప అర్బన్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న జరగనున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపట్టినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో ‘పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్’హాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందులలో జరిగిన దాడులు, అల్లర్ల సంఘటనలపై సమగ్రంగా విచారిస్తున్నామన్నారు. సంఘటనలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆ ప్రాంతానికి చెందిన వారు కాకుండా ఇతరులకు అనుమతి లేదన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు దాదాపు 600 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించామన్నారు.