సోమశిలలో.. అక్రమ వేట! | - | Sakshi
Sakshi News home page

సోమశిలలో.. అక్రమ వేట!

Jul 30 2025 8:35 AM | Updated on Jul 30 2025 8:35 AM

సోమశి

సోమశిలలో.. అక్రమ వేట!

రాజంపేట : సోమశిల జలాశయం (నెల్లూరు జిల్లా సోమశిల)కు సంబంధించి బ్యాక్‌వాటర్‌ ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా పరిధిలోని అట్లూరు, గోపవరం, నందలూరు, ఒంటిమిట్ట మండలాల్లో విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాక్‌ వాటర్‌లో గుడ్డు దశలో ఉన్న చేపల సంపదపై అక్రమవేట కొనసాగుతోంది. చేపల వృద్ధి అడ్డుగా అక్రమవేట కొనసాగుతోంది. పరోక్షంగా చేపల సంపదకు గండి కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంతానోత్పత్తికి విఘాతం కలిగిస్తున్నారు.

ఇలా అక్రమ రవాణా..

ప్రధానంగా సోమశిల బ్యాక్‌ వాటర్‌లో చేప పిల్లలకు ప్రాణ సంకటంగా పరిణమించే అలివి వలను అక్రమార్కులు వినియోగిస్తున్నారు. ఒంటిమిట్ట మండలంలో పల్లాగట్ట నుంచి చేపలను అక్రమంగా వేటాడి నందలూరు మండలంలోని కోనాపురానికి చేర్చి, అక్కడి నుంచి చేపల మార్కెట్‌కు చేరుస్తున్నారు. పాత మాధవరం, బోయనపల్లె, చిన్నపురెడ్డిపల్లె, కొండమాచుపల్లె, గుండ్లమాడ, దొంగలసాని గ్రామాలతో పాటు నందలూరు, గోపవరం మండలాల్లో దర్జాగా చేపల అక్రమ వేట జరుగుతోంది.

ఆగస్టు 31 వరకు వేటపై నిషేధం

జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు సోమశిల బ్యాక్‌ వాటర్‌లో చేపల వేట నిషేధమని ప్రభుత్వం ప్రకటించిన సంగ

తి తెలిసిందే. అయినా నాటు పడవల ద్వారా బ్యాక్‌వాటర్‌లోకి అక్రమంగా ప్రవేశించి చేప పిల్లలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం మత్స్యశాఖకు తెలియకుండా ఉండదని ముంపుబాధితులు పేర్కొంటున్నారు. బ్యాక్‌ వాటర్‌లో వేట నిషేధం అమలు కావడం లేదని వారంటున్నారు.

యథేచ్ఛగా చేపల అక్రమ వేట..

సోమశిల బ్యాక్‌వాటర్‌ సమీప ముంపు గ్రామమైన నందలూరు మండలంలోని కోనాపురం ప్రాంతంలో చేపల అక్రమ వేట కొనసాగుతోంది. నిషేధం ఆంక్షలను సైతం పట్టించుకోకుండా చేపలు పట్టేవారు బ్యాక్‌ వాటర్‌లోకి నాటుపడవలు వేసుకొని వెళుతున్నారు. దాదాపు 200 నుంచి 300 మంది వరకు మత్స్యకారులు వేటను కొనసాగించే క్రమంలో బ్యాక్‌వాటర్‌ వెంబడి తాత్కాలిక నివాసాలు వేసుకొని జీవిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, వైజాగ్‌, నెల్లూరు, ప్రకాశంతోపాటు మరికొన్ని జిల్లాల నుంచి మత్స్యకారులను రప్పించి, వారిచేత వేట చేయిస్తున్నారు. ప్రతి రోజు 10 నుంచి 15 టన్నుల చేపలు పట్టి తిరుపతి, విజయవాడ, హైదరాబాద్‌, చైన్నె, కోలకత్తా చేపల మార్కెట్‌కు తరలిస్తున్నారు.

మత్స్యశాఖ అధికారులకు తెలియకుండానే..

చెన్నూరు, మాధవరం, కొడమలూరు తదితర ప్రాంతాలకు చెందిన కొందరు చేపల వ్యాపారంలో ఆరి తేరి వున్నారు. వీరి కనుసన్నల్లో చేపల అక్రమవేట కొనసాగుతోంది. ఈ విషయం మత్స్యశాఖ అధికారులు, సిబ్బందికి తెలిసిన బహిరంగ రహస్యమే. వారికి మామూళ్లు అందుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో సోమశిల బ్యాక్‌వాటర్‌లో జరిగే చేపల అక్రమ వేటను చూసీ చూడనట్లు, తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని ముంపు వర్గాల వారు బహిరంగంగానే పేర్కొంటున్నారు. బాక్స్‌ రూ.7వేల నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు. వివిధ రకాల చేపలను పట్టుకొని బ్యాక్‌వాటర్‌ ఒడ్డుకు తీసుకొచ్చి కేజి రూ.120 నుంచి రూ.140 వరకు అమ్మకాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం మత్స్యశాఖ అధికారులు, సిబ్బందికి తెలియకుండానే జరుగుతుందనేది వాస్తవం కాదు.

మత్స్యశాఖ అధికారి ఏమంటున్నారంటే..

సోమశిల బ్యాక్‌వాటర్‌లో చేపల అక్రమ వేటపై రాజంపేట మత్స్యశాఖ అఽధికారి మురళీని వివరణ కోరగా తాను కొత్తగా వచ్చానన్నారు. బ్యాక్‌వాటర్‌లో చేపల వేట నిషేధం కొనసాగుతోంది. అయినా అక్రమంగా చేపలవేట కొనసాగుతుందన్న విషయం తనకు తెలియదన్నారు. ఈ విషయంపై తాను విచారణ చేసి, చర్యలు తీసుకుంటానని తెలిపారు. కాగా, ఒంటిమిట్ట మండలం (వైఎస్సార్‌ జిల్లా) పరిధిలోని బ్యాక్‌వాటర్‌ విస్తరించిన ప్రాంతంలో స్థానికంగా ఉన్న వారిని ఖాళీచేసి వెళ్లిపోవాలని, చేపల వేట నిషేధం ఉందని హెచ్చరించామని మత్స్యశాఖ ఎఫ్‌డీఓ కిరణ్‌కుమార్‌ తెలిపారు. కోనాపురం వైపు చేపల వేట జరుగుతోందన్న సమాచారం రాజంపేటకు చెందిన అధికారి మురళికి తెలియజేశామని వెల్లడించారు.

బ్యాక్‌వాటర్‌ పెరగుతోందని..

రెండు, మూడు రోజుల్లో బ్యాక్‌వాటర్‌ పెరుగుతోందన్న సమాచారంతో బ్యాక్‌వాటర్‌లో చేపల అక్రమ వేటను వేగవంతం చేసుకుంటున్నారు. ముంపు గ్రామాల్లో చేపల రవాణా సందడి నెలకొంది. వాహనాలలో ఐస్‌ బాక్స్‌లో చేపలను రవాణా చేస్తున్నారు. బ్యాక్‌వాటర్‌లో దొరికినకాడికి చేపలను వలవేసి పట్టుకొని దొడ్డిదారిలో చేపల మార్కెట్‌కు తరలిస్తున్నారు. బ్యాక్‌ వాటర్‌ పెరిగితే అక్రమ వేటకు అడ్డుగా మారుతుందనే భావనలో వేట నిర్వాహకులు ఉన్నారు.

వెలిగల్లులోనూ..

గాలివీడు : వెలిగల్లు జలాశయంలో రెండు మాసాలపాటు చేపల వేటపై నిషేధం ఉన్నా విచ్చల విడిగా చేపల వేట కొనసాగుతోంది. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మత్స్యకారులను ప్రలోభపెట్టి చేపలు పట్టిస్తున్నారు. అడ్డుకోవాల్సిన నిఘా యంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకుని చోద్యం చూస్తోంది. రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా వలలు వేసి తెల్లవారుజామున సరుకు మొత్తం గాలివీడు, రాయచోటి, మదనపల్లె, కడప ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనధికారికంగా వేట సాగిస్తుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గాలివీడు విలేజ్‌ ఫిషర్స్‌ అసిస్టెంట్‌ రామాంజి నాయక్‌ తెలిపారు.

ఆగస్టు 31 వరకు చేపల వేటపై నిషేధం

ముంపు గ్రామాల నుంచి అక్రమ రవాణా

నిద్రావస్థలో మత్స్యశాఖ అధికార గణం

సోమశిలలో.. అక్రమ వేట!1
1/1

సోమశిలలో.. అక్రమ వేట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement