ఖాకీ క్రౌర్యం.. పోయిన ప్రాణం
● పేకాట వ్యవహారంలో నారాయణరెడ్డిపై గంజాయి కేసు
● డబ్బుల ఇవ్వకపోవడంతోనే నమోదు
● బెయిల్‌పై వచ్చినా..ఇబ్బంది పెట్టిన వైనం
● ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త
ఖాజీపేట: పోలీసులు పెట్టిన తప్పుడు కేసు, ఆపై వేధింపులు.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నా యి. ఒక కుటుంబాన్ని వీధిన పడేలా చేశాయి. ఇద్దరు చిన్నారులను తండ్రిని కోల్పోయిన వారిగా మార్చా యి. పేకాట కేసులో తీసుకొచ్చిన వారిపై ఖాజీపేట పోలీసులు కేసులు నమోదు చేయకుండా.. డబ్బులు బేరసారాలు చేయడం, కుదరక పోవడంతో గంజాయి కేసు నమోదు చేశారు. ఈ సంఘటన దుంపలగట్టు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మినారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణమైంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నూరు చెక్కర ఫ్యాక్టరీ సమీపంలో మే 6న పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడులు చేయడానికి వారు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో.. అక్కడికి వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేశారు. సుమారు 12 మంది పేకాట ఆడేందుకు వస్తున్నట్లు అనుమానించారు. అందులో దుర్గం ఖాదర్ బాషా, సిద్దంగారి గురుమహేశ్వర్‌రెడ్డి, రెడ్యం శివలక్ష్మినారాణరెడ్డి, మాచుపల్లి గుర్రప్ప, ఇరగంరెడ్డి భరత్‌రెడ్డి, నాగూర్ బాషా, కమాల్‌బాషా, లక్ష్మిరెడ్డి, నాగేంద్రరెడ్డి, ఫరూక్, కుమార్‌రెడ్డి, లోకేష్‌రెడ్డిలు పేకాట ఆడేందుకు వెళ్తున్నట్లు అనుమానించారు. వారిని మే 6న ఖాజీపేట పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు. అయితే పేకాట ఆడలేదని వారిలో కొందరు చెప్పారు. దీంతో అప్పుడు కేసు నమోదు చేయకుండా పంపించారు. అనంతరం 7, 8వ తేదీల్లో పిలిపించారు. వారిలో కొందరిని డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు. ఇవ్వక పోవడంతో 9న పేకాటతోపాటు గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు 12 మందిపై కేసు నమోదు చేశారు. 2.570 గ్రాముల గంజాయి పట్టుకున్నట్లు, రూ 20,500 నగదు, 52 పేక ముక్కలు దొరికినట్లు కేసు కట్టారు. అందులో 9 మందిని అరెస్ట్ చేసి కోర్డుకు పంపించారు. ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నట్లు కేసులో కనపరిచారు.
రెడ్యం శివలక్ష్మినారాయణరెడ్డి ఆత్మహత్య
ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని రెడ్యం శివలక్ష్మినారాయణరెడ్డిని నిందితునిగా చేర్చి, అతనిపై గంజాయి కేసు నమోదు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మే 9న అరెస్టయిన అతను మే 29న కండీషన్ బెయిల్‌పై బయటికి వచ్చాడు. వచ్చిన తరువాత కూడా తనను పోలీసులు చేసిన చిత్రహింసలకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులకు వివరించాడు. దెబ్బలను తన భార్య సుభాషిణికి చూపించాడు. తనకు ఎలాంటి సంబంధం లేని కేసులో ఇరికించారని భార్య వద్ద తీవ్ర మనోవేదన వ్యక్తం చేశాడు. దీనికి తోడు కండీషనల్ బెయిల్‌పై రావడంతో.. ప్రతి వారంలో రెండు సార్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేసి పోవాల్సి వచ్చింది. సంతకాలకు వెళ్లినప్పుడల్లా డబ్బుల కోసం వేధిస్తున్నట్లు భార్య దగ్గర వాపోయాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
విద్యుత్ తీగలు పట్టుకుని..
బుధవారం రాత్రి ఇంటిలో నుంచి బయటికి వెళ్లిన నారాయణరెడ్డి పుష్పగిరికి వెళ్లే రహదారిలోని ట్రాన్స్‌ఫార్మర్ వైరు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ చూసిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో.. అప్పటికే వెతుకుతున్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. అయినా వెంటనే చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు.
● తన భర్త నారాయణరెడ్డి మృతికి ఖాజీపేట సీఐ మోహన్ వేధింపులే కారణం అని రెడ్యం సుభాషిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
‘నా భర్త నారాయణరెడ్డి పోలీసుల వేధింపులతోనే చనిపోయాడు. మా కుటుంబానికి దిక్కు లేకుండా చేశారు. ఇద్దరు బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మాకు ఉన్న పెద్ద దిక్కు లేకుండా చేశారు. ఇందుకు కారణం పోలీసులే.. ఇప్పుడు నా భర్త మృతికి బాధ్యత ఎవరు తీసుకుంటారు. నాకు న్యాయం చేయాలి’ అని నారాయణరెడ్డి భార్య గుండెలవిసేలా రోదించింది. ఆమె ఆవేదన అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
నా భర్త మృతికి బాధ్యత ఎవరిదీ?
ఖాకీ క్రౌర్యం.. పోయిన ప్రాణం


