
జనసే నాయకుల నిరసనకు తల పట్టుకుంటున్న టీడీపీ ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేష్
మదనపల్లె : టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఎవరూ తోడులేకున్నా, తమ నాయకుడు పవన్‌కల్యాణ్ అండగా నిలవడమే కాకుండా కలిసి ఎన్నికల్లో పోటీచేద్దామని నిర్ణయం తీసుకుంటే.. స్థానిక టీడీపీ నాయకులు మాత్రం జనసేన పొత్తుకు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరుగట్టువారిపల్లె టీడీపీ కార్యాలయంలో ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గస్థాయి జయహో బీసీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మదనపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
జనసేన నాయకులు రామాంజనేయులు తన అనుచరులతో కలిసి సమావేశానికి వచ్చారు. సమావేశంలో ఇద్దరు టీడీపీ నాయకుల ప్రసంగం తర్వాత మూడో వ్యక్తిగా రామాంజనేయులుకు అవకాశం ఇచ్చారు. ఆయన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునేందుకు శ్రమిద్దామని పిలుపునిచ్చారు. తర్వాత వచ్చిన టీడీపీ నాయకులందరూ వారి పార్టీ భజన, ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేష్‌ను కీర్తించడమే పనిగా పెట్టుకున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేరు మాటవరుసకై నా ప్రస్తావించడం వదలిపెట్టి, కేవలం టీడీపీ ఎమ్మెల్యేనే గెలిపించుకుందామంటూ చెప్పుకోసాగారు.
దీంతో ఆగ్రహించిన జనసేన నాయకులు పొత్తులో ఉన్నప్పుడు రెండుపార్టీల గురించి సమానంగా మాట్లాడి, ఎవరికి సీటు కేటాయించినా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పాల్సింది పోయి.. టీడీపీకే సీటు వచ్చేసినట్లుగా ప్రచారం చేసుకోవడమేంటని నిలదీశారు. దీంతో అవాక్కయిన టీడీపీ నాయకులు జనసేన నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. విలువ లేనిచోట నిమిషమైనా ఉండలేమంటూ, జనసేన శ్రేణులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీడీపీ నేతలు తమ గొప్పలు చెప్పుకుని సమావేశం ముగించారు.