
కుప్పం కాలువపై పూర్తి చేస్తున్న టన్నల్ పనులు
బి.కొత్తకోట: మాజీ సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరుజిల్లా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను వచ్చే అక్టోబర్‌లో తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఏవీఆర్ హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండో దశలో అంతర్భాగంగా చేపట్టిన కుప్పం ఉప కాలువ పనుల (కేబీసీ)ను గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వదిలేసింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం కుప్పంకు కృష్ణా జలాలను తరలించాలన్న ఆశయంతో ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో పనులన్నీ పూర్తయ్యాక శ్రీసత్యసాయిజిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను తరలించి ట్రయల్‌రన్ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
పనులు సత్వరమే పూర్తి చేసేలా మిగిలిన భూసేకరణకు ఈనెల 23న రూ.40 కోట్లు, పనులకు రూ.60 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.430.27కోట్లతో చేపట్టిన కుప్పం ఉపకాలువ చిత్తూరుజిల్లా పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణీ మండలం అప్పినపల్లె చెరువు వద్ద ప్రారంభమై కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చెరువులో కలుస్తుంది.
పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని వీ.కోట, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లె, కుప్పం, గంగవరం, పెద్దపంజాణీ, బైరెడ్డిపల్లె మండలాల్లో 6,300 ఎకరాలకు ఆయకట్టు, 4.02లక్షల మంది జనా భాకు తాగునీరు అందించి, 110 చెరువులకు కృష్ణా జలాలను అందించాలన్నది ప్రణాళిక. దీనికి 1.10 టీఎంసీల నీటిని తరలించాలని ప్రతిపాదించారు. 143 కిలోమీటర్ల కాలువ పనులు, 3 ఎత్తిపోతల పథకాల నిర్మాణం, 285 కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలి. అయితే గత టీడీపీ పాలనలో ఉపకాలువ పనులను పూర్తి చేయించే విషయంలో మాజీ సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంతో కాంట్రాక్టు సంస్థ పనులు నిలిపివేయగా పట్టించుకోలేదు.
ప్రస్తుతం.. పనులు చకా చకా
ప్రస్తుత ప్రభుత్వం కుప్పంకు కృష్ణా జలాలను తరలించాలన్న కృతనిశ్చయంతో అసంపూర్తి పనులను చేపట్టి పూర్తి చేయించే దిశగా అడుగులు వేస్తోంది. కుప్పం ఉపకాలువ పనులను ప్రభుత్వం చకా చకా చేయిస్తోంది. గత టీడీపీ హయాంలో అగిపోయిన అసంపూర్తి పనులను ప్రభుత్వం గత కాంట్రాక్టు సంస్థ ఒప్పందం మేరకే ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థకు అప్పగించి అదనంగా భారం పడకుండా చేసింది. రూ.62.98 కోట్ల విలువైన సివిల్ పనులు ఆగిపోగా వాటిని రూ.63.31 కోట్లకు, రూ.33.89 కోట్ల విలువైన మెకానికల్ పనులను రూ.36.09 కోట్లకు అప్పగించారు.
ఈ పనులు చేపట్టిన ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ పనులు వేగవంతం చేసింది. రూ.37.11 కోట్ల సివిల్ పనులు, రూ.8.36 కోట్ల మెకానికల్ పనులు పూర్తయ్యాయి. రూ.27.20 కోట్ల సివిల్ పనులు, రూ.27.73 కోట్ల మెకానికల్ పనులు జరుగుతున్నాయి. 4.8 కిలోమీటర్ల అసంపూర్తి కాలువ పనిలో 4.22 కిలోమీటర్ల కాలువ పూర్తయ్యింది. 112 పెండింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణాల్లో 38 పూర్తి చేయగా, 49 నిర్మాణాలు సాగుతుండగా, 25 పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులను సెప్టెంబర్‌లోగా పూర్తి చేయించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి..
శ్రీసత్యసాయిజిల్లా కదిరి సమీపంలో చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి ప్రారంభమయ్యే హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండో దశలోని పుంగనూరు ఉపకాలువ అన్నమయ్యజిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం మీదుగా మదనపల్లె, చిత్తూరుజిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం మీదుగా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణీ మండలంలోని అప్పినపల్లె వరకు సాగుతుంది. ఇక్కడి నుంచే కుప్పం ఉపకాలువ ప్రారంభమై..కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చెరువులో కలిసి ముగుస్తుంది.
కుప్పం కాలువ పూర్తయ్యాక చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు ప్రాజెక్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నారు. అక్టోబర్ రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లో ట్రయల్‌రన్ పూర్తి చేసి కుప్పంకు కృష్ణా జలాలు తరలించాలని చర్యలు చేపట్టారు. రెండురోజుల క్రితం జలవనరులశాఖ ఉన్నతస్థాయి అధికారులు నిర్వహించిన సమీక్షలోనూ సత్వరమే కుప్పం కాలువ పనులు పూర్తిచేసి నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు.
అక్టోబర్‌లో నీళ్లిస్తాం
కుప్పం నియోజకవర్గానికి అక్టోబర్ రెండోవారంలో కృష్ణా జలాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగా పనుల్లో వేగం పెంచాం. రెండునెలల్లో మిగులు పనులు పూర్తి చేయించి నీళ్లు పారిస్తాం. ఎత్తిపోతల పథకలను సిద్ధం చేస్తున్నాం. సాంకేతిక సమస్యలను గుర్తించి సరిచేస్తున్నాం. –సీఆర్.రాజగోపాల్, ఎస్‌ఈ, మదనపల్లె

గుడిపల్లె మండలం ఒంటపల్లె వద్ద సాగుతున్న కాలువ పనులు