
‘యూరియా అందుబాటులో ఉంది’
రాయచోటి: జిల్లాలో యూరియా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం రాత్రి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని యూరియా నిల్వ, బొప్పాయికి మద్దతు ధర తదితర అంశాలపై కలెక్టర్ జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తప్పుడు కథనాలతో రైతులను ఆందోళనకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు, ట్రేడర్స్, రైతు సంఘాల సమన్వయంతో బొప్పాయి ధర నిర్ణయించినట్లు చెప్పారు. టాప్ గ్రేడ్ బొప్పాయి కిలో రూ. 8, సెకండ్ గ్రేడ్ కిలో రూ. 7.50లుగా నేడు నిర్ణయించారన్నారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో పంట తక్కువగా సాగు చేస్తున్నందున యూరియా అవసరం తక్కువగా ఉంటుందన్నారు. ప్రైవేట్ డీలర్ల వద్ద, రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అవసరమయ్యే యూరియా అందుబాటులో ఉందన్నారు. కొంతమంది రైతులను రెచ్చగొట్టడం, కృత్రిమంగా యూరియా కొరత సృష్టించడం వంటి పనులు చేస్తున్నారన్నారు. ఈ పనులు చట్టరీత్యా నేరమని, అటువంటి పనులు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.