ఈనెలలో జోనల్‌ స్థాయి నైపుణ్య పోటీలు

Zonal level skill competitions in these months - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వెల్లడి

రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ 10

వచ్చే ఏడాది షాంఘైలో ప్రపంచస్థాయి పోటీలు

సాక్షి, అమరావతి: చైనాలోని షాంఘై నగరంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ప్రపంచ స్థాయి నైపుణ్య పోటీల్లో భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ), స్కిల్‌ ఇండియా సంస్థల సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నైపుణ్య పోటీలను నిర్వహించనుంది. ఏప్రిల్‌ మూడు, నాలుగు వారాల్లో మొత్తం 11 విభాగాల్లో ఈ పోటీలు జరపాలని నిర్ణయించింది. రోబోటిక్‌ సిస్టమ్స్‌ ఇంటిగ్రేషన్, అడిటివ్‌ మాన్యుఫాక్చరింగ్‌ బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడలింగ్, ఇండస్ట్రీ 4.0, మెకట్రానిక్స్‌ విభాగాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే వారు 1996 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలి. మిగతా విభాగాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే వారు 1999 జనవరి 1వ తర్వాత జన్మించి ఉండాలి. ఆసక్తి ఉన్నవారు ఈనెల 10లోపు  www.apssdc.in లోగానీ.. http:// engineering. apssdc. in/ worldskillsap/ లోగానీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని ఈ పోటీలకు నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డీవీ రామకోటిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్య పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాలకు ఏపీఎస్‌ఎస్‌డీసీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004252422లో సంప్రదించవచ్చు.  

సెప్టెంబర్‌లో జాతీయస్థాయి పోటీలు
కాగా, నైపుణ్య పోటీల్లో పాల్గొనేందుకు రిజస్ట్రేషన్‌ చేసుకున్న వారందరినీ విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నంలో జరిగే జోనల్‌ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జోనల్‌ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని మే మొదటి వారంలో జరిగే రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలకు ఎంపిక చేస్తారు. ఇక మెకట్రానిక్స్‌ జ్యువెలరీ, ఐటీ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేషన్, ప్రొటోటైప్‌ మోడలింగ్, ప్లాస్టిక్‌ డై ఇంజనీరింగ్‌ పోటీలకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు నేరుగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపిక చేస్తారు. అక్కడ ప్రతిభ కనబరిచిన వారిని ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని షాంఘై నగరంలో నిర్వహించే ప్రపంచస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి నగదు ప్రోత్సాహకంతోపాటు మెడల్, సర్టిఫికెట్లు అందజేస్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top