తాడేపల్లి :ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు(బుధవారం, నవంబర్ 12వ తేదీ) వైఎస్సార్‌సీపీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ర్యాలీలకు పార్టీలకతీతంగా అంతా కలిసి రావాలని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రేపు చేపట్టే ర్యాలీల ద్వారా ప్రజాస్పందనను గట్టిగా వినిపిద్దామన్నారు సజ్జల.
ఈ మేరకు మంగళవారం(నవంబర్11వ తేదీ) వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రేపు గట్టిగా పోరాటం చేద్దాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలదలో కేంద్రాల్లో ర్యాలీలను సూపర్ సక్సెస్ చేద్దాం. జగన్ తెచ్చిన వైద్య విప్లవాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారు.
వైద్యవిద్యార్ధుల కలలను సాకారం చేయాలన్న గొప్ప సంకల్పం జగన్‌ది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణను చూసైనా చంద్రబాబు బుద్దితెచ్చుకోవాలి. వైద్య వ్యవస్ధను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం,. ప్రజా స్పందనను బలంగా వినిపిద్దాం. అందరి భాగస్వామ్యం వలనే కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అన్ని పథకాలు నిర్వీర్యం చేసింది.
ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. అన్ని రంగాలు కుదేలయ్యాయి. రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వంపై దేశంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత వచ్చింది. రేపటి ర్యాలీలకు పార్టీలకు అతీతంగా కలిసిరావాలి. విద్యార్ధులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో ర్యాలీలు విజయవంతం అవ్వాలి. మనం చేసే ఆందోళనలు, ర్యాలీల గురించి జాతీయస్ధాయిలో చర్చ జరిగేలా ఉండాలి. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం దిగివస్తుంది’ అని పేర్కొన్నారు.


