ప్రజల తరఫున ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. వేధింపులు | YSRCP President YS Jagan at PAC meeting | Sakshi
Sakshi News home page

ప్రజల తరఫున ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. వేధింపులు

Jul 30 2025 4:58 AM | Updated on Jul 30 2025 7:15 AM

YSRCP President YS Jagan at PAC meeting

పీఏసీ సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ధ్వజం 

అన్నింటా విఫలమైన కూటమి ప్రభుత్వం.. ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా పచ్చి మోసం

అందుకే ప్రశ్నించే విపక్షం గొంతు నొక్కే ప్రయత్నం 

రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి.. యథేచ్ఛగా దోపిడీ 

ఎక్కడా పాలన అనేదే లేదు.. ప్రజలకు ఏ మేలూ లేదు 

చంద్రబాబు ష్యూరిటీలో పక్కాగా మోసం గ్యారెంటీ 

బాబు మోసాలను మరింతగా ఎండగట్టాలి 

ఆ దిశలోనే ఇప్పటికే వైఎస్సార్‌సీపీ కార్యక్రమం 

రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మన కార్యక్రమం చేరాలి

పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి 

వేధింపులకు గురైన వారి కోసం త్వరలో ప్రత్యేక యాప్‌ 

మన ప్రభుత్వం రాగానే బాధ్యులందరిపైనా చర్యలు 

తప్పు చేసిన వారందరినీ చట్టం ముందు నిలబెడతాం 

మన ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో నేరుగా కానీ, కార్పొరేషన్లకు గ్యారెంటీతో కానీ చేసిన మొత్తం అప్పు రూ.3.32 లక్షల కోట్లు. అయితే అందులో 52 శాతం అప్పును చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లోనే చేసింది. ఏ స్కీమ్‌ లేదు. అయినా రూ.1.75 లక్షల కోట్లు అప్పు చేశారు. మన హయాంలో రెండేళ్లు కోవిడ్‌. అయినా అన్ని పథకాలు అమలు చేశాం. గ్రామ, వార్డు సచివాలయాలు కట్టాం. ఆర్బీకేలు కట్టాం. పోర్టుల నిర్మాణం చేపట్టాం. స్కూళ్లు బాగు చేశాం. కొత్త మెడికల్‌ కాలేజీలు తెచ్చాం. విలేజ్‌ క్లినిక్స్‌ కట్టాం. పాలనలో విప్లవాత్మక మార్పులు చూపాం. ఇవన్నీ నిర్వీర్యం అయ్యాయి.  – వైఎస్‌ జగన్‌

ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. అవన్నీ వీరి జేబుల్లోకి పోతున్నాయి. అందుకే దేశ ఆదాయం సగటున 12 శాతం పెరిగితే, ఇక్కడ అది కేవలం 3 శాతమే. అంటే ఇక్కడ ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వానికి కాకుండా, వీరి జేబుల్లోకి పోతోంది. అందుకే ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదు. ఇప్పుడు మళ్లీ సింగపూర్‌ పర్యటన. ఈ డబ్బులన్నీ అక్కడ దాచి పెట్టుకోవడానికే ఈ పర్యటన.      – వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ సహా ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల అమలులో.. పరిపాలనలో అన్నింటా టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి.. యథేచ్ఛగా దోపిడీ సాగుతోందని మండిపడ్డారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తే విపక్షం గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని ఎత్తిచూపారు. రాష్ట్రంలో ఎక్కడా పరిపాలన అనేది లేదని, ప్రజలకు ఏ మేలూ జరగడం లేదన్నారు. 

చంద్రబాబు ష్యూరిటీలో పక్కాగా మోసం గ్యారంటీ అన్నది స్పష్టమైందన్నారు. చంద్రబాబు మోసాలు మరింతగా ఎండగట్టాలని.. ఆ దిశలో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ కార్యక్రమం చేపట్టిందని– అదే రీకాలింగ్‌ ఆఫ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేసుకుంటూ..) అని గుర్తు చేశారు. ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మన కార్యక్రమం చేరాలని.. అందుకు పార్టీలో సీనియర్‌ నేతలు మరింతగా చొరవ చూపాలని వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. 

ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు హాజరయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు.. అక్రమ కేసులు, అరెస్టులు.. ప్రజల తరపున ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం.. వైఎస్సార్‌సీపీలో చురుకుగా వ్యవహరిస్తున్న నాయకులే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగిస్తున్న వేధింపులు.. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం.. చంద్రబాబు చేసిన, చేస్తున్న మోసాలను ప్రజల్లో ఇంకా బలంగా ఎండగట్టడం.. బాబూ ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తీసుకెళ్లడంపై సమావేశంలో వైఎస్‌ జగన్‌ చర్చించారు. 

కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమాలు, అవినీతిపై ప్రజల తరఫున ప్రశ్నిస్తూ.. పోరాటం చేస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. సూచనలు, సలహాల కోసం పార్టీలో సీనియర్లను పీఏసీలోకి తీసుకొచ్చామని.. నెలకోసారి పీఏసీ సమావేశం జరిగేలా చూస్తామని చెప్పారు. ‘ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు అందరికీ తెలుసు. మనం ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. చూస్తుండగానే దాదాపు ఏడాదిన్నర గడిచింది. ఇంకా మనకు మిగిలింది మూడేళ్లు మాత్రమే. మనం ఇప్పుడు రాక్షస పాలన చూస్తున్నాం. దాన్ని ఇంకా ఎదుర్కోవాల్సి ఉంది’ అని అన్నారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

మనం ఇదే సంప్రదాయం కొనసాగిస్తే టీడీపీ సీనియర్‌ నేతలంతా జైళ్లలోనే.. 
» రాష్ట్రంలో ఎక్కడా పరిపాలన అనేది లేదు. ప్రజలకు ఏ మేలూ జరగడం లేదు. రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి.. యథేచ్ఛగా దోపిడీ సాగుతోంది. ప్రజల తరఫున ప్రశ్నిస్తే విపక్షం గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు. మన పార్టీ సీనియర్‌ నాయకులను జైళ్లలో పెడుతున్నారు. భవిష్యత్తులో మనం ఇదే సంప్రదాయం కొనసాగిస్తే టీడీపీ సీనియర్‌ నాయకులంతా జైళ్లలోనే ఉంటారు. 

ఎందుకంటే ఇక్కడ మన లీడర్లను అన్యాయంగా జైళ్లలో పెట్టారు. మిథున్‌ రెడ్డిని చూస్తే బాధనిపిస్తోంది. ఆయన్ను నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. మేకపాటి గౌతమ్‌రెడ్డిని కూడా నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. వారి తండ్రులు మా నాన్న బ్యాచ్‌. వారిద్దరూ నా బ్యాచ్‌. నా ఫ్రెండ్స్‌. కేవలం వేధించడం కోసమే మిథున్‌రెడ్డిని అరెస్టు చేసి, జైల్లో పెట్టారు. ఆయన కనీసం ఇక్కడ మంత్రి కూడా కాదు. ఆయన తండ్రి రామచంద్రన్న ఎక్సైజ్‌ మంత్రి కూడా కాదు.  

»  అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఆయన ఖర్మ ఏమిటంటే, అది చంద్రబాబు నియోజకవర్గం. అక్కడ మంత్రిగా ఉండి కూడా చంద్రబాబు ఓడిపోయాడు. 1978లో ఎమ్మె­ల్యే­గా చంద్రగిరి నుంచి గెల్చి, మంత్రిగా ఉంటూ పోటీ చేసి 1983లో ఓడిపోయాడు. ఆ తర్వాత తన మామ కాళ్లూ వేళ్లూ పట్టుకుని టీడీపీలో చేరి, పోటీ చేశాడు. ఆ తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు. చంద్రగిరిలో తన ప్రత్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కాబట్టి, టార్గెట్‌ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన కొడుకును కూడా వేధించి అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారు.  

»  నందిగం సురేష్‌ దళితుడు. ఎంపీగా ఎదిగాడు. 6 నెలల 10 రోజులు.. మొత్తం 191 రోజులు జైల్లో పెట్టారు. ఒక కేసు కాగానే మరో కేసు పెట్టి జైల్లో ఉంచారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేశారు. క్వార్ట్జ్‌ గనుల కేసు.. టోల్‌ గేట్‌ కేసు.. ఇలా వరసగా కేసులు పెట్టి, వేధిస్తున్నారు. ఇప్పటికే జైల్లో పెట్టారు. ఇప్పుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ టార్గెట్‌. ఆయన్నూ అరెస్టు చేయాలని చూశారు. కానీ, ఆ కుట్రలో భాగంగా అరెస్టు అ వ్యక్తి (శ్రీకాంత్‌రెడ్డి) జడ్జి ముందు నోరు విప్పి పోలీసుల వేధింపుల గురించి చెప్పడంతో అనిల్‌ కుమార్‌ అరెస్టు కాలేదు. 

 

ప్రజల తరఫున ప్రశ్నించే వారందరి గొంతు నొక్కే ప్రయత్నం 
» ప్రజల తరపున మాట్లాడే వారిని, ప్రజా సమస్యలు ప్రస్తావించే వారిని ఇలా వేధించడం ఇదే మొదటిసారి. నిజానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి, సుపరిపాలన అందిస్తే, ఇలాంటి చర్యలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏ హామీ అమలు చేయకపోవడంతో, ప్రజల వద్ద ముఖం చెల్లక ఇలా ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశలోనే జోగి రమేష్‌ కొడుకును అరెస్టు చేయడం.. రోజాను వేధించి ఆనందం పొందడం.. విడదల రజని మీదా కేసు పెట్టారు. వేధించే ప్రయత్నం చేస్తున్నారు. 

» నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి దారుణం. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో విధ్వంసం సృష్టించారు. అదృష్టవశాత్తు అప్పుడు ఆయన ఇంట్లో లేరు. ఒకవేళ ఆయన ఇంట్లో ఉండి ఉంటే చంపేసే వారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. కారును కూడా పడదోశారు. దాడిపై ఆయన ఫిర్యాదు చేస్తే, పట్టించుకోని పోలీసులు.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేయగానే తిరిగి ప్రసన్నకుమార్‌రెడ్డిపైనే చర్య తీసుకున్నారు. తాడిçపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సొంత ఇంటికి పోనివ్వడం లేదు. పైగా సీఐ గన్‌ చూపి బెదిరిస్తున్నారు.   

కొందరు పోలీసుల అవినీతిపర్వం 
కొందరు పోలీసులు అవినీతిలో మునిగిపోయారు. ఒక జోన్‌కు డీఐజీ. ఆయన ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు.. వసూళ్లు చేసి, ఎమ్మె­ల్యేలకు, అక్కణ్నుంచి సీఎంకు, ఆయన కుమారుడికి నిధులు ఇస్తున్నారు. అలా ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం నిర్వహించి, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు. వారికి పోలీసులు రక్షణగా నిలుస్తున్నా­రు. ఇసుక దగ్గరుండి అమ్మిస్తున్నారు. ఏ ఒక్క గని కూడా వదలడం లేదు. నేరుగా డీఐజీ డీల్‌ చేస్తున్నాడు. ఎమ్మెల్యేకు ఇంత.. సీఎంకు ఇంత.. ఆయన కొడుక్కి ఇంత.. అని ఇస్తున్నారు. ఇందులో డీఎస్పీ, సీఐలకూ వాటా వెళ్తోంది. ఇంత అవినీతి గతంలో ఎక్కడా చూడలేదు. 

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ సక్సెస్‌  
‘రీకాలింగ్‌ ఆఫ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’.. బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ కార్యక్రమం బాగా కొనసాగుతోంది. ఇప్పటికే 175 నియోజకవర్గాలకు గాను 169 చోట్ల జరిగింది. ఆరు నియోజకవర్గాల్లో వేర్వేరు కారణాల వల్ల ఆలస్యమైంది. 640 మండలాల్లో దాదాపు 538 మండలాల్లో పూర్తి కాగా, మిగిలిన 102 మండలాల్లో వేగంగా పూర్తి చేస్తాం. దాదాపు 90 నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమం ద్వారా  గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమం సాగుతోంది. మన క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా ప్రతి ఇంటికీ ఈ కార్యక్రమం చేరుతోంది. ఆ ఇంటికి చంద్రబాబు ఎంత బాకీ ఉన్నాడు.. గత ఏడాది ఎంత ఎగ్గొట్టాడు.. ఈ ఏడాది ఎంత బాకీ పడుతున్నాడు.. అనేది చెబుతున్నాం.  

కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్‌.. డిజిటల్‌ లైబ్రరీ
వచ్చే వారంలో మనం ఒక యాప్‌ విడుదల చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్క­డైనా, ఎవరైనా, ఏ కార్యకర్త అయినా అధికారులతో వేధింపులకు గురైతే, లేదా ఏదైనా అన్యాయానికి గురైతే ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఫిర్యాదు చేయొచ్చు. మీకు ఏ రకంగా అన్యాయం జరిగింది..? అని ఆ యాప్‌లో స్పష్టంగా ఉంటుంది. ఫలానా అధికారి.. ఫలానా నాయకుడి ఆదేశాలతో నాపై అన్యాయంగా, అక్రమంగా కేసు పెట్టి.. చిత్రహింసలకు గురి చేశారని బాధితులంతా ఫిర్యాదు చేయొచ్చు. 

ఏ అధికారి ఎలా ఇబ్బంది పెట్టారో.. ఏ విధంగా బాధ పెట్టారో.. తద్వారా ఎలా ఇక్కట్లకు గురయ్యారో.. ఇబ్బంది పెట్టిన వారి పేర్లతో సహా వివరించవచ్చు. ఎవరి ప్రోద్బలంతో ఇబ్బందులకు గురి చేశారో స్పష్టంగా చెప్పొచ్చు. దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే, వాటినీ అప్‌లోడ్‌ చేయొచ్చు. అవన్నీ మన డిజిటల్‌ లైబ్రరీలోని సర్వర్‌కు చేరుతాయి. రేపు మన ప్రభుత్వం రాగానే, డిజిటల్‌ లైబ్రరీలో (సర్వర్‌) దాన్ని ఓపెన్‌ చేస్తాం. 

ఎవరెవరైతే మన కార్యకర్తలకు అన్యాయం చేశారో వారెవ్వరినీ వదలకుండా చట్టం ముందు నిలబెడతాం. వారందరికీ సినిమా చూపిస్తాం. వారు చేసినవన్నీ వడ్డీతో సహా చెల్లిస్తాం. ఇక్కడ మనం ఎలాంటి అన్యాయం చేస్తామనడం లేదు. ఈ రోజు వారు ఏ విత్తనం విత్తుతున్నారో రేపు అదే పండుతుంది. అందుకే చక్రవడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది.

ఆడబిడ్డ నిధి అడిగితే రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు 
» ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. 18 ఏళ్లకు మించిన మహిళలు రాష్ట్రంలో 2.10 కోట్లు ఉన్నారు. వారికి నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే, రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు. మరి ఎందుకు హామీ ఇచ్చినట్లు?  

»  అమ్మ ఒడి తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఇచ్చినా 30 లక్షల మందికి తగ్గించాడు. రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత మాటమార్చి రూ.13 వేలు అని చెప్పారు. అదీ ఇచ్చారా అంటే లేదు. రూ.8,500 చొప్పున ఇచ్చారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీలో మనం ఇవన్నీ ప్రజలకు వివరిస్తున్నాం.  

» రాష్ట్రంలో తొలిసారి పిల్లలు చదువు మానేస్తున్నారు. పిల్లలకు విద్యా దీవెన లేదు. 2024లో జనవరి–మార్చి త్రైమాసికం మొదలు, ఇప్పటి వరకు మొత్తం ఆరు క్వార్టర్లు పెండింగ్‌. రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4,200 కోట్లు కావాలి. ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. వసతి దీవెన ఏటా ఏప్రిల్‌లో రూ.1,100 కోట్ల చొప్పున ఇవ్వాలి. అది కూడా ఇవ్వకపోవడంతో రెండేళ్లకు రూ.2,200 కోట్లు పెండింగ్‌. రెండూ కలిపి మొత్తం రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. దీంతో పిల్లలు బడి మానేస్తున్నారు. 

» ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు. 14 నెలల నుంచి పెండింగ్‌. అలా రూ.4,200 కోట్లు బకాయి. ఇచ్చింది రూ.400 కోట్లు కూడా లేదు. ఆరోగ్య ఆసరాకు ఏటా అయ్యే ఖర్చు రూ.450 కోట్లు. అదీ ఇవ్వడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం నిరాకరిస్తున్నాయి. 

» ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఏ రైతు పరామర్శకు వెళ్లినా కేసు పెడుతున్నారు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఆర్బీకేలు  నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్‌ లేదు. నిరుద్యోగ భృతి దేవుడెరుగు. పిల్లలకు ఏమీ చేయడం లేదు. నాడు–నేడు మనబడి లేదు. అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా?

గ్రామ స్థాయిలోనూ అనుబంధ కమిటీలు 
» రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. విన్‌ వన్‌సైడ్‌ ఉంటుంది. మొత్తం సీట్లు ఎప్పుడు గెలుస్తామంటే.. గ్రామ స్థాయిలో కూడా పార్టీ నిర్మాణం బాగా జరిగినపుడే. ప్రతి ఊళ్లో కనీసం 10 మందిని (గ్రామ కమిటీ సభ్యులు) ఆ ప్రాంత ఎమ్మెల్యే గుర్తు పట్టాలి. పేరు పెట్టి పిలిచేలా ఉండాలి.  

»గ్రామ కమిటీల తర్వాత, బూత్‌ కమిటీల నిర్మాణం జరగాలి. అలా ఒక వైపు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేస్తూనే మరో వైపు ప్రజల్లో మరింత మమేకమై పని చేయాలి. ప్రతి గ్రామంలో మనకు యువజన, మహిళ, విద్యార్థి, సోషల్‌ మీడియా, రైతు, కార్మిక విభాగాల కమిటీలు ఉండాలి. అప్పుడే మరింత బలపడతాం.  

నేను ఫలానా గ్రామంలో మహిళా అధ్యక్షురాలిని. నేను విద్యార్థి విభాగం నాయకుడిని.. అని చెప్పుకునేలా గ్రామ స్థాయిలో పక్కాగా అన్ని కమిటీల నిర్మాణం జరగాలి. వారికి ఐడీ కార్డు కూడా ఇవ్వాలి. దాని వల్ల వారిని ప్రోత్సహించినట్లు అవుతుంది. దీని వల్ల పార్టీ ఏ కార్యక్రమం చేసినా సక్సెస్‌ అవుతుంది. ఇలా ప్రతి గ్రామంలో ఆరు నుంచి ఏడు కమిటీలు ఏర్పాటు చేస్తే, 13 వేల గ్రామాల్లో ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షులే దాదాపు 80 వేల మంది ఉంటారు. ఇక సభ్యుల సంఖ్య సరేసరి. రెండు మూడు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి కావాలి.  ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌లో బాబు ష్యూరిటీకి సంబంధించి క్యూ ఆర్‌ కోడ్‌ ఓపెన్‌ చేసుకునేలా పార్టీ సీనియర్‌ నేతలంతా చొరవ చూపాలి.      – వైఎస్‌ జగన్‌

మానిటరింగ్‌ ముఖ్యం
» మీరంతా సీనియర్‌ లీడర్లు కాబట్టి కాస్త చొరవ చూపాలి. జిల్లా స్థాయిలో అందరితో, నాయకులతో మమేకం కావాలి. పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలి. యువ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తూ పని చేయాలి.  

»మన వ్యవస్థ.. జిల్లా అధ్యక్షులు.. రీజినల్‌ కో ఆర్డినేటర్లు.. పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు.. అందరూ వారి వారి స్థాయిలో క్రియాశీలకంగా మారాలి. మరింత చొరవతో పని చేయాలి. మీరు ఎప్పుడైతే యాక్టివేట్‌ అవుతారో.. జూనియర్‌ నాయకులూ చొరవ చూపుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం వస్తుంది. ఆ సమయంలోనే మనకు గ్రామాలపై, పార్టీ కార్యకర్తలపై స్పష్టమైన అవగాహన వస్తుంది. ఎవరు, ఎలా కష్టపడుతున్నారనేది తెలుస్తుంది. వారందరినీ వ్యవస్థీకృత విధానంలోకి తీసుకొస్తే, అన్నీ సక్రమంగా జరుగుతాయి.

» రచ్చబండ కార్యక్రమం తర్వాత, గ్రామ కమిటీల ఏర్పాటు జరుగుతోంది. గతంలో మొక్కుబడిగా అవి ఏర్పాటయ్యేవి. ఇప్పుడు వాటి ఏర్పాటులో మన నాయకుల మానిటరింగ్‌ ఉండాలి. గ్రామ స్థాయిలో మన కార్యకర్త ఒక వ్యవస్థీకృత విధానంలోకి రావాలి. వారికి మీరు దిశా నిర్దే«శం చేయాలి.   

» ఇప్పుడు చంద్రబాబునాయుడు చేసిన మోసం స్పష్టంగా కనిపిస్తోంది. అదే మనం ఉంటే, అన్నీ దక్కేవని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు రావడంతో బిర్యానీ మాట దేవుడెరుగు.. పలావ్‌ కూడా పోయిందని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మీరు మూవ్‌ కావాలి. మరింత అగ్రెసివ్‌గా పని చేయాలి. కార్యకలాపాల్లో అందరూ పాల్గొనాలి. అవన్నీ సక్రమంగా జరగాలంటే గ్రామ కమిటీల ఏర్పాటు కూడా పూర్తి కావాలి.   

» కార్యకర్తలకు మంచి ఇన్సూరెన్స్‌ కల్పిస్తాం. మన పార్టీకి 15 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రజల్లో మనం బలంగా ఉన్నాం. ఇంకా బలోపేతం కావాలంటే, కార్యకర్తలు చాలా ముఖ్యం. మనం వారికి తోడుగా, అండగా ఉన్నామన్న విశ్వాసం కల్పించాలి. గతంలో మన ప్రభుత్వ హయాంలో కోవిడ్‌ వల్ల కార్యకర్తలను అంతగా పట్టించుకోలేకపోయాం. ఈసారి అలా కాదు. వారికి చాలా ప్రాధాన్యం ఇస్తాం.

వైఎస్‌ జగన్‌ భద్రతపై పీఏసీ సభ్యుల ఆందోళన 
ఇటీవలి పర్యటనల్లో జగన్‌కు ప్రభుత్వం తగిన భద్రత కల్పించక పోవడంపై సమావేశంలో పీఏసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటన సందర్భంగా పోలీసులు చూపిన నిర్లక్ష్యాన్ని సమావేశంలో సభ్యులు ప్రస్తావించారు. ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం ఆయనకు తగిన భద్రత కల్పించడం లేదని తేల్చి చెప్పారు. జగన్‌ భద్రతపై వినిపిస్తున్న కథనాలు తమను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో జగన్‌ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ పీఏసీ సభ్యులు స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement