YSR Pelli Kanuka: పేదింటికి పెళ్లి కానుక.. పూర్తి వివరాలిలా.. | Sakshi
Sakshi News home page

YSR Pelli Kanuka: పేదింటికి పెళ్లి కానుక.. పూర్తి వివరాలిలా..

Published Tue, Sep 27 2022 9:15 AM

YSR Pelli Kanuka Scheme Eligibility Criteria Details here - Sakshi

సాక్షి, నంద్యాల(అర్బన్‌): పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అంటారు పెద్దలు. ఎందుకంటే ఈ రెండు కార్యాలు  చాలా ఖర్చుతో కూడుకున్నవని అర్థం. పేదలు తమ ఆడపిల్లలకు పెళ్లి చేసేందుకు అప్పులు చేసి వాటిని తీర్చలేక సతమతమవుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారికి పెళ్లి సమయంలో అండగా నిలబడేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  వైఎస్సార్‌ పెళ్లికానుక (వైఎస్సార్‌ కల్యాణ మస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా) పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ పథకాల ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు, వివాహం రిజిస్ట్రేషన్‌ చేయడం ద్వారా వధువుకి రక్షణ కల్పిస్తుంది.

ఈ మేరకు సర్కారు వైఎస్సార్‌ పెళ్లి కానుకను రూపకల్పన చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు, మైనార్టీలకు షాదీ తోఫా పేరుతో శ్రీకారం చుట్టిన ఈ పథకాలను అక్టోబర్‌ 1 నుంచి అమలు చేయనుంది.  ఇప్పటికే ఆయా పథకాలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలతో  ప్రభుత్వం జీఓ.47ను  జారీ చేసింది.   టీడీపీ ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఆర్థిక సాయం రెండింతలు పెంచడంతో పాటు ఎక్కువ మందికి  ప్రయోజనం అందేలా పథకాలు ఉండటంతో జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అర్హతలు ఇలా.. 
వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీతోఫా  పథకానికి సంబంధించి అర్హత నిబంధనలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది.  అక్టోబర్‌ 1 నుంచి  గ్రామ/వార్డు సచివాయాల ద్వారా   దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తారు.  వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి ఆర్థికసాయం అందుతుంది. వధువు, వరుడు పదవ తరగతి పూర్తిచేసి ఉండాలి.  అలాగే వధువు, వరుడు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలు లోపు ఉండాలి. మూడు ఎకరాలకు మించి మాగాణి, 10 ఎకరాలకు మించి మెట్టభూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి 10 ఎకరాలలోపు ఉండవచ్చు.  

సర్కారు అందించే పెళ్లి కానుక ఇలా..   
►ఎస్సీ, ఎస్టీల వివాహాలకు  రూ.లక్ష  
►ఎస్టీ, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు 
►బీసీలకు రూ.50 వేలు 
►కులాంతర వివాహాలకు రూ.75వేలు 
►మైనార్టీలకు రూ.లక్ష 
►దివ్యాంగులకు రూ.1.50 లక్షలు 
►భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు 

ఆడ పిల్లల తల్లిదండ్రులకు సీఎం అండ
వైఎస్సార్‌ పెళ్లి కానుక ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు  ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అండగా నిలబడుతున్నారు.  సొంత అన్నలా పేద కుటుంబాలను ఆదుకోవడానికి సీఎం ముందుకు రావడం  హర్షణీయం. గతంలో టీడీపీ దుల్హన్‌ పథకం కింద కేవలం రూ.50వేలు ఇచ్చేది. అది కూడా కొందరికే.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాయం మొత్తాన్ని రూ.లక్షకు పెంచడం హర్షణీయం.  తెలుగుదేశం నాయకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప పేదలను ఆదుకున్న పాపాన పోలేదు. – ఇసాక్‌బాషా, ఎమ్మెల్సీ, నంద్యాల 

పేదలకు ఆర్థిక ఊరట
వైఎస్సార్‌ పెళ్లికానుక వెనుకబడిన అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉంది. ఈ పథకం ద్వారా  అందజేసే నగదును రెండింతలు చేయడం వల్ల నిరుపేద కుటుంబాలకు ఊరట కలుగుతుంది. కొంత వరకు అప్పులు చేసే బాధ తప్పుతుంది. గతంలో ఎవ్వరూ చేయని విధంగా ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెళ్లి కానుక పథకాన్ని రూపొందించడం అభినందనీయం. 
–మేస చంద్రశేఖర్, కౌన్సిలర్‌ దేవనగర్, నంద్యాల 

అర్హులందరికీ పెళ్లి కానుక 
ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం దరఖాస్తులు పరిశీలించి అర్హులందరికీ వైఎస్సార్‌ పెళ్లి కానుక అందేలా చూస్తాం. ప్రతి ఒక్కరు అవసరమైన రికార్డులతో పెళ్లికి పదిరోజులు ముందుగానే దరఖాస్తు చేసుకొని పథకం ప్రయోజనాన్ని పొందాలి. ఇప్పటికే కులాల వారీగా ఎవరికి ఎంత మొత్తం ఇవ్వనుందో ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. 
–రవిచంద్రారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్, నంద్యాల 

Advertisement

తప్పక చదవండి

Advertisement