నింగినంటిన విజయోత్సవాలు | YSR Congress Party Supporters Is In Full Josh With Municipal Elections Results | Sakshi
Sakshi News home page

నింగినంటిన విజయోత్సవాలు

Mar 15 2021 3:51 AM | Updated on Mar 15 2021 3:51 AM

YSR Congress Party Supporters Is In Full Josh With Municipal Elections Results - Sakshi

గుంటూరు జిల్లా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తల సంబరాలు

సాక్షి, అమరావతి: మునిసి‘పోల్స్‌’లో తిరుగులేని విజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం పెద్దఎత్తున విజయోత్సవాలు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం కన్పించింది. ఏకపక్ష ఫలితాలు వెలువడతాయనే నమ్మకంతో ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆదివారం ఉదయం నుంచే ఆనందోత్సాహాలకు తెరలేపారు. కౌంటింగ్‌ ఆరంభం నుంచే తమకు అనుకూలంగా వస్తున్న ఫలితాలతో పార్టీ అభిమానులు కేరింతలు కొట్టారు. వైరిపక్షం టీడీపీని కకావికలం చేస్తూ విజయం వైపు దూసుకుపోతున్న తీరుతో అన్ని వర్గాల వారు సంబరాలు చేసుకున్నారు. పట్టణాలే కాకుండా పల్లెల్లోనూ విజయోత్సవ వేడుకలు పెద్దఎత్తున జరిగాయి. జగన్‌ ప్లకార్డులతో ఊరేగింపులు చేసుకున్నారు.

అతి తక్కువ కాలంలోనే తమ వద్దకు చేరిన సంక్షేమ ఫలాలను గొప్పగా చెప్పుకున్నారు. ఇక గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మొత్తం సందడే కన్పించింది. ఉ.10 గంటలకల్లా అనేక ప్రాంతాల నుంచి అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్‌ నినాదంతో ఆ ప్రాంతం మార్మోగింది. పార్టీ ఆఫీసు వద్ద సభా వేదికను నిర్మించారు. వచ్చిన జనానికి భోజనాలు, మంచినీళ్లు పార్టీ వర్గాలు ఏర్పాటుచేశాయి. విజయోత్సవానికి తరలివచ్చిన మహిళలు పూలదండలతో ఆ ప్రాంతాన్ని అలంకరించారు. పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. డప్పుల మోత.. అభిమానుల నృత్య ప్రదర్శనలు, కోలాటాలు, జయహో జగన్‌ అంటూ జేజేలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.  విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ పార్టీ విజయ దుందుభితో అభిమానం ఉప్పొంగింది. 

అభిమానులతో నేతలు మమేకం
జనాభిమానంతో వైఎస్సార్‌సీపీ నేతలు మమేకమయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్ర కార్యాలయం వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. మంత్రులు, సీనియర్‌ నేతలు ధన్యవాదాలు చెప్పారు. కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌ లేళ్ల అప్పిరెడ్డి అభిమానులకు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఫలితాల తీరును విశ్లేషిస్తూ నేతలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ చల్లా మధు, రాష్ట్ర అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, అంకిరెడ్డి నారాయణమూర్తి, ఈదా రాజశేఖర్, నారమల్లి పద్మజ, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement