
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు సంబంధించిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ(గురువారం, జులై 3న) విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున మాజీ ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. హెలిప్యాడ్ కోసం సూచించిన స్థలం మనుషులు సంచరించడానికి వీల్లేకుండా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన.
ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ నెల్లూరు హెలిపాడ్ అనుమతి పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ‘‘హెలిప్యాడ్‌కు అనుమతి ఇవ్వడంలేదని కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే.. హడావిడిగా ఒక ప్రాంతాన్ని ఎంపికచేశారు. ఇదే హెలిపాడ్ అంటున్నారు. ఆ స్థలంలో తుప్పలు, డొంకలు ఉన్నాయి. మనుషులుకూడా నడవడానికి వీల్లేకుండా ఉంది. హెలిపాడ్ కోసం ఆ స్థలాన్ని సిద్ధం చేయాలంటే మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టేలా ఉంది.
..మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి విషయంలో కేంద్ర ప్రభుత్వపు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. ఆ మార్గదర్శకాల ప్రకారం.. జడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తులకు రోప్‌పార్టీలు ఇవ్వాలి కదా?పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు మేనేజ్ చేయడానికి రోప్ పార్టీలు అత్యంత అవసరం. జగన్‌లాంటి వ్యక్తికి సేఫ్ ల్యాండింగ్, సేఫ్ ట్రావెల్, సేఫ్ మూవ్ అనేది కల్పించాలి కదా. రోప్‌పార్టీలు ఇవ్వడానికి ప్రభుత్వ ఎందుకు దాగుడుమూతలు ఆడుతుందో అర్థం కావడంలేదు’’ అని లాయర్ శ్రీరాం వాదించారు.
పై విషయాలన్నింటికీ ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదు. పైగా వైఎస్ జగన్ భద్రత గురించి వేసిన 2 పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. జడ్ ప్లస్ కింద ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామంటూ చెప్పారు. అలాంటప్పుడు రోప్ పార్టీలు లేవు కదా? అని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరాం మరోసారి ప్రశ్నించారు. దీంతో.. ఈ పిటిషన్‌పై వాదనలకు మరింత సమయం కావాలని ఏజీ కోరడంతో.. కోర్టు వచ్చే బుధవారానికి(జులై 9) విచారణ వాయిదా వేసింది.