విశాఖలో 2023 అక్టోబర్ 16న ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న నాటి సీఎం వైఎస్ జగన్ (ఫైల్)
2023లో విశాఖ ఐటీ క్యాంపస్‌ను ప్రారంభించిన మాజీ సీఎం జగన్
మధురవాడ ఐటీ హిల్ నెంబర్–2లో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి నష్టం లేకుండా ఐటీ దిగ్గజాన్ని తెచ్చిన వైఎస్ జగన్
ఇప్పుడు రూ.1,000 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని 99 పైసలకే అప్పగిస్తున్న చంద్రబాబు సర్కార్
వేలం ద్వారా భూములు కేటాయిస్తూ ఖజానాకు ఆదాయం పొందుతున్న ఇతర రాష్ట్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఖజానా ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖకు ఇన్ఫోసిస్‌ను తీసుకువస్తే.. ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదే ఐటీ సంస్థకు రూ.1,000 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే చంద్రబాబు సర్కారు కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే రూ.వేల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు పప్పు బెల్లాలుగా అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిలదీసినా చంద్రబాబు సర్కారులో ఎటువంటి మార్పులేదు.
రూ.వేల కోట్ల లాభాలను గడిస్తూ... ఒకపక్క తన దగ్గర ఉన్న భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తున్న ఇన్ఫోసిస్‌కు తాజాగా విశాఖలోని ఎండాడలో అత్యంత ఖరీదైన భూములను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు హైదరాబాద్‌లో వేలం ద్వారా భూములను విక్రయిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని పొందుతుంటే, రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కారు రూ.వేల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది.
తొలిసారిగా టైర్–2 నగరానికి తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే
తొలిసారిగా ఇన్ఫోసిస్‌ను టైర్–2 నగరానికి తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధురవాడలోని ఐటీ హిల్–2లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక ప్రైవేటు బిల్డింగ్‌లో 1,000 సీట్లతో ఏర్పాటు చేసుకున్న డెవలప్‌మెంట్ సెంటర్‌ను 2023 అక్టోబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. భవిష్యత్తులో విస్తరణకు సహాయ సహకారాలను అందిస్తామని హామీనిచ్చారు.
అయితే అప్పుడు రాష్ట్ర ఖజానాకు ఎటువంటి నష్టం లేకుండా ఐటీ కంపెనీని తీసుకువస్తే.. చంద్రబాబు సర్కారు మాత్రం మూడు నెలలకు ఒకసారి రూ.8,500 కోట్లకుపైగా లాభాలు గడించే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజానికి 99 పైసలకే విలువైన భూమిని కేటాయించడాన్ని మేధావులు విమర్శిస్తున్నారు. గతేడాది బెంగళూరులో తన వద్ద అదనంగా ఉన్న 53 ఎకరాలను ఇన్ఫోసిస్ రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయించిందని, ఇలా రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను విక్రయించుకుంటున్న సంస్థకు విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూమిని 99 పైసలకే ఏ విధంగా కట్టబెడతారంటూ ప్రశి్నస్తున్నారు.
భూములివ్వడంతోపాటు భవన నిర్మాణానికీ డబ్బులు..!
చంద్రబాబు సర్కారు ఇప్పటికే విశాఖలో ఐటీ ముసుగులో అనేక రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు 99 పైసలకు భూములు కేటాయించినట్లు చూపిస్తూ అదే సమయంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కట్టబెడుతోంది. ఐటీ క్యాంపస్‌లు, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్స్ పేరిట కే.రహేజా, సత్వా, కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అంతేకాకుండా ఇలా కేటాయించిన భూముల్లో 50 శాతం స్థలం వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించడాన్ని వీరు తప్పుబడుతున్నారు. అది చాలదన్నట్లు.. ఆ సంస్థలు పెడుతున్న పెట్టుబడిలో 60 నుంచి 70 శాతం ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి ఇవ్వడంతోపాటు భవన నిర్మాణాల కోసం ఒక్కో చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెల్లిస్తోందంటూ తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


