మహిళా కండక్టర్‌పై చేయి చేసుకున్న యువకుడు | Youth Attack on RTC Bus Conductor | Sakshi
Sakshi News home page

మహిళా కండక్టర్‌పై చేయి చేసుకున్న యువకుడు

Jun 6 2026 12:01 PM | Updated on Jun 6 2026 12:06 PM

Youth Attack on RTC Bus Conductor

మార్కాపురం జిల్లా: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు మహిళా కండక్టర్‌పై యువకుడు దాడిచేసిన సంఘటన శుక్రవారం జరిగింది. పొదిలి డిపోకు చెందిన కండక్టర్‌ దుద్దుకూరి పద్మ మధ్యాహ్న సమయంలో ఒంగోలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో విధి నిర్వహణలో ఉంది. పొదిలి మండలం ఏలూరు గ్రామానికి చెందిన యువకుడు బస్సు ఎక్కి వంద రూపాయల నోట్‌ ఇచ్చాడు. 

దీంతో చార్జీపోను మిగిలిన బ్యాలెన్స్‌ టికెట్‌పై రాసిచ్చింది. దీనికి సంబంధించి చిల్లర ఇవ్వాలని యువకుడు సదరు కండక్టర్‌తో వాదనకు దిగాడు. మాటామాటా పెరిగి యువకుడు కండక్టర్‌ గొంతు పట్టుకుని పైకి లేపాడు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. మరోవైపు కండక్టర్‌ దుస్తుల్లో ఉన్న ఫోన్‌ లాక్కున్నాడు. ఇదంతా గమనిస్తున్న మహిళా ప్రయాణికులు సదరు యువకుడిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. 

రామతీర్థం దగ్గర బస్సు దిగిన యువకుడు.. పొదిలి వైపు వెళుతున్న గిద్దలూరు బస్సు రన్నింగ్‌లో ఉండగానే ఎక్కాడు. అప్పటికే పొదిలి సిబ్బంది అందరికీ సమాచారం ఇవ్వటంతో.. అదే బస్సులో ఉన్న ఇద్దరు పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని పొదిలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ అనంతరం.. సంఘటన జరిగిన ప్రాంతం చీమకుర్తి పరిధిలో ఉన్నందున కేసును అక్కడికి సీఐ రాజేష్‌ కుమార్‌ బదిలీ చేశారు. మహిళా కండక్టర్‌పై విచక్షణా రహితంగా దాడి చేయటంతో పాటు సెల్‌ ఫోన్‌ దుస్తుల్లో నుంచి లాక్కున్న యువకుడిని శిక్షించాలని ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement