మహిళల పారిశ్రామిక అభ్యుదయం.. పరిశ్రమల స్థాపనకు ముందడుగు | Sakshi
Sakshi News home page

మహిళల పారిశ్రామిక అభ్యుదయం.. పరిశ్రమల స్థాపనకు ముందడుగు

Published Sat, Nov 19 2022 7:48 PM

Women Entrepreneurship Day 2022: Vizianagaram Women Entrepreneurs - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇంటికి దీపం ఇల్లాలు అనేది నానుడి. ఇప్పుడు ఇంటికే కాదు సమాజాభివృద్ధిలో మహిళలు కీలకమయ్యారు. ఏ రంగంలో అడుగుపెట్టినా నిరంతర కృషితో, ఒడుదొడుకులను ఎదుర్కొనే సామర్థ్యంతో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు పారిశ్రామికం రంగంలోనూ తామే కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా ఒంటిచేత్తే విజయాలను అందుకుంటున్నారు. సంక్షేమ పథకాల్లోనూ, రాజకీయ పదవుల్లోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి పారిశ్రామిక రంగంలోనూ అదే తరహాలో ప్రోత్సహిస్తున్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు స్థలంతో పాటు రుణాల మంజూరుకు ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. పెట్టుబడిలో రాయితీలు కల్పిస్తోంది. సింగిల్‌ విండో విధానంలో త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తోంది. మరెక్కడా లేనివిధంగా కొత్తవలస మండలం రెల్లి వద్ద 159 ఎకరాల్లో మహిళలకు ప్రత్యేక ఇండస్ట్రియల్‌ పార్కు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అనేకమంది మహిళలు పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములు అవుతున్నారు. పదిమందికీ ఉపాధి కల్పిస్తూ పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు.  

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 37 భారీ, మెగా పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో 18,202 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో మహిళా భాగస్వామ్యం ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో కొత్త పరిశ్రమలకు మార్గం సుగమమైంది. రూ.4,460 కోట్ల పెట్టుబడితో మరో 14 పరిశ్రమలు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. వీటికి వివిధ దశల్లో అనుమతులు మంజూరు కావాల్సి ఉంది. అవి కార్యరూపంలోకి వస్తే 19,038 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరో 2,883 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానుల్లో ఎక్కువ మంది మహిళలే. ఆ పరిశ్రమల ద్వారా ప్రస్తుతం 41,175 మందికి ఉపాధి లభిస్తోంది. 
 
జిల్లా కలెక్టర్‌గా ఎ.సూర్యకుమారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. ఔత్సాహికులకు ప్రత్యేకంగా జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు  చేస్తున్నారు. ఫలితంగా 2,370 వరకూ దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 2,296 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చారు. ఆయా లబ్ధిదారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటం విశేషం. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) కింద పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలను డీఐసీ అధికారులు అందిస్తున్నారు. 

కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో 70.41 ఎకరాలు, రామభద్రాపురం మండలం కొటక్కి గ్రామం వద్ద 187.08 ఎకరాలు, నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ మండలం జి.చోడవరం గ్రామంలో 155.92 ఎకరాల్లో కొత్తగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసమే ప్రత్యేకంగా కొత్తవలస మండలంలోని రెల్లి గ్రామం సమీపంలో 159 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కు అందుబాటులోకి రానుంది.

ప్రభుత్వం 2020–23 నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ, మెగా పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి రాయితీ 15 శాతం నుంచి 45 శాతం వరకూ ఇస్తోంది. భూమి కొనుగోలుపై స్టాంప్‌ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, భూమి తనఖాకు 100 శాతం రాయితీ కల్పిస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళలకు ఏపీఐఐసీ ప్లాట్లలో 50 శాతం రాయితీ ఇస్తోంది. వీటితోపాటు భూమి మార్పిడి చార్జీలు, విద్యుత్‌ వినియోగం, వడ్డీ రీయింబర్స్‌మెంట్‌పై రాయితీలు కల్పిస్తోంది. అమ్మకపు పన్ను, సీడ్‌ కాపిటల్‌పై 50 నుంచి శత శాతం రాయితీలు లభిస్తున్నాయి.  


ప్రభుత్వ ప్రోత్సాహకంతో పరిశ్రమ పెట్టా... 

ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకుల్లో అదీ తక్కువ నీటి వినియోగంతో చేపల పెంపకాన్ని కువైట్‌లో చూశాను. రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్‌ సిస్టమ్‌ (ఆర్‌ఏఎస్‌)లో నీటి పునర్వినియోగమవుతున్న తీరు నన్ను ఆకర్షించింది. అలాంటి పరిశ్రమను పెట్టాలనే ఆలోచనతో తమిళనాడులో శిక్షణ తీసుకున్నాను. జిల్లాకు వచ్చిన తర్వాత నా ప్రాజెక్టు రిపోర్టును చూసి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నిర్మలాకుమారి, ఎస్‌బీఐ భోగాపురం శాఖ మేనేజర్‌ లక్ష్మి ఎంతో ప్రోత్సహించారు. గత ఏడాది నిర్వహించిన ఎస్‌బీఐ క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ క్యాంపెయిన్‌ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి చేతుల మీదుగా రుణమంజూరు చెక్కును అందుకున్నాను. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు పీఎంఎంఎస్‌వై పథకంలో 60 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తోంది. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. 
– కేవీ నాగమణి, ఆర్‌ఏఎస్‌ యూనిట్‌ యజమాని, పోలిపల్లి, భోగాపురం మండలం 


వంద మందికి ఉపాధి కల్పనే లక్ష్యం... 

మనం బతకడమే కాదు పదిమందిని బతికించడంలోనే ఆనందం ఉంది. స్వతహాగా పిండివంటల తయారీపై అభిలాష ఉండేది. బెలగాంలోని మా ఇంటిలోనే ఎనిమిదేళ్ల క్రితం వివిధ రకాల పిండివంటల తయారీని వ్యాపారాత్మకంగా ప్రారంభించాను. నలుగురికి ఉపాధి కల్పించాను. వినియోగదారుల ఆదరణ పెరగడంతో తయారీని పెంచాం. ప్రస్తుతం 45 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఔత్సాహికులకు అవగాహన కల్పిస్తున్నాను. ఫుడ్‌గార్డెన్‌ స్టాల్‌ ప్రారంభించిన తొలిరోజుల్లో కాస్త ఒడుదొడుకులు ఎదురైనా తట్టుకొని నిలబెట్టాను. ఈ పరిశ్రమను మరింత విస్తరించి వంద మందికి ఉపాధి కల్పించాలనేది నా లక్ష్యం.  
– బి.కన్యాకుమారి, ఫుడ్‌గార్డెన్‌ యజమాని, పార్వతీపురం 


18 మందికి ఉపాధి కల్పిస్తున్నా... 

వ్యాపార రంగంలో అడుగుపెట్టి  పది మందికి ఉపాధి చూపించాలని తొలి నుంచి ఆలోచించేదాన్ని. 2012 సంవత్సరంలో రూ.75వేల పెట్టుబడితో టెక్ట్‌టైల్స్‌ వ్యాపారం ప్రారంభించాను. మూడేళ్లలో వచ్చిన లాభంతో గంట్యాడ మండలం నందాం గ్రామంలో 75 సెంట్ల స్థలం కొన్నాను. జిల్లాలో అత్యధికంగా పండే మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి ప్రత్యేకంగా కార్టూన్‌ బాక్స్‌లు అవసరం. వాటిని తయారుచేసేందుకు శ్రీసాయిసుధా కోరుగేటెడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో 2017లో పరిశ్రమను బ్యాంకు రుణం రూ.1.50 కోట్లతో ప్రారంభించాను. 2018 నుంచి ఉత్పత్తి మొదలైంది. రూ.40 లక్షల టర్నోవర్‌ వచ్చింది. తర్వాత సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాం. ప్రస్తుతం ఏటా కోటి రూపాయల టర్నోవర్‌ స్థాయికి చేరుకున్నాను. 18 మందికి సాంకేతిక అవగాహన కల్పించి ఉపాధి ఇస్తున్నాను. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆర్గానిక్‌ ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నాను. 
– బి.సుధార్చన, పారిశ్రామికవేత్త, నందాం, గంట్యాడ మండలం

Advertisement
 
Advertisement
 
Advertisement