Anil Kumar: ‘ప్రధాని మోదీ, జలశక్తి మంత్రికి లేఖలు రాస్తున్నాం’

Water Dispute: Anil Kumar Says Construction Of Projects According To Rules - Sakshi

సాక్షి, అమరావతి: నిబంధనలకు లోబడే నీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం మంత్రి అనిల్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ వ్యవహరిస్తున్న తీరును ఆయన విమర్శించారు.

అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు కడుతున్నారు
‘‘848 అడుగులపైన ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోగలం.. తెలంగాణకు 800 అడుగులపైనే నీళ్లు తీసుకునే అవకాశం ఉంది.. కృష్ణా బేసిన్‌లో 15 రోజులు మాత్రమే 880 అడుగులపైన నీటి లభ్యత ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ అపెక్స్‌ కౌన్సిల్‌ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. ఇరిగేషన్‌ అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి చేయాలి. శ్రీశైలం డ్యామ్‌ నిండకూడదనే దుర్మార్గమైన చర్య జరుగుతుంది.

కేఆర్‌ఎంబీ ఆదేశాలు జారీ చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ అని మంత్రి అనిల్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. ఇక తెలంగాణ వ్యవహారశైలిపై నేడే ప్రధాని మోదీకి, జలశక్తి మంత్రికి లేఖలు రాస్తున్నామన్న మంత్రి... రాష్ట్రప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామని పునరుద్ఘాటించారు. ‘‘తెలంగాణ చర్యలను అడ్డుకుని తీరుతాం. అవసరమైతే ప్రాజెక్ట్‌లను కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమే’’ అని స్పష్టం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ జలవివాదంపై దృష్టి సారించిన ఏపీ కేబినెట్‌.. రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేదిలేదని స్పష్టం చేస్తూ తీర్మానం చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top