విశాఖ నగరంపై స్టార్టప్‌ కంపెనీల దృష్టి, భారీగా పెట్టుబడులు

Vizag To Host StartUp Companies - Sakshi

సాక్షి, అమరావతి: నూతన టెక్నాలజీ ఆవిష్కరణలకు విశాఖపట్నం వేదిక కానుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రెండు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ) కేంద్రాలు విశాఖలో సిద్ధమయ్యాయి. 

స్టీల్‌ ప్లాంట్‌లో ఒకటి.. ఏయూలో మరొకటి 
దేశ పారిశ్రామిక రంగంలో ఆటోమేషన్‌ను పెంచే విధంగా ఇండస్ట్రీ–4 టెక్నాలజీకి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా విశాఖ స్టీల్‌లో కల్పతరువు పేరుతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ రూపుదిద్దుకుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు స్టీల్‌ ప్లాంట్‌ రూ.10 కోట్లు కేటాయించగా కేంద్రం రూ.30 కోట్లను మంజూరు చేసింది. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటవుతున్న ఇండస్ట్రీ–4 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను జనవరిలో కేంద్రమంత్రుల ద్వారా ప్రారంభించేలా ఎస్‌టీపీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మరోవైపు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి మరో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నాస్కామ్‌ నెలకొల్పింది. ఆంధ్రా యూనివర్సిటీలో సుమారు 3,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని పరికరాలతో కూడిన ల్యాబ్, 3–డీ ప్రింటర్స్, పీసీబీ ప్రొటోటైప్‌ మెషీన్స్, సోల్డరింగ్‌ స్టేషన్లు, హైఎండ్‌ ఆసిలోస్కోప్స్‌తో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనున్నారు. నాస్కామ్‌ ఏర్పాటు చేసిన సీవోఈని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్‌ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖరన్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. 

నగరంపై స్టార్టప్‌ కంపెనీల దృష్టి 
విశాఖపట్నంలో పలు భారీ పరిశ్రమలు ఉన్నందున నాలుగో తరం పారిశ్రామిక ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రెండు సీవోఈలు సిద్ధం కావడంతో స్టార్టప్‌ కంపెనీలు నగరానికి క్యూ కడతాయని ఐటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. పరిశ్రమల్లో ఆటోమేషన్‌ను పెంచేందుకు బిలియన్‌ డాలర్లు వ్యయం చేస్తున్నారని, ఈ రంగంలో కృషి చేస్తున్న అన్ని స్టార్టప్‌ కంపెనీలు ఇప్పుడు విశాఖకు రానున్నాయని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఐటాప్‌) అంచనా వేస్తోంది.

విశాఖలో ఏర్పాటైన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధన రంగాల్లో టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన అప్లికేషన్ల అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు నాస్కామ్‌ తెలిపింది. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి విద్య, వైద్యం, సంక్షేమ శాఖల్లో ఐవోటీ, ఏఐ టెక్నాలజీని వినియోగించే విధంగా నాస్కామ్‌ పలు అప్లికేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే మార్క్‌ఫెడ్‌తో కలసి డిజిటల్‌ ఎంఎస్‌పీ ప్రొక్యూర్‌మెంట్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది.

ఐటీ హబ్‌గా విశాఖ..
హైఎండ్‌ టెక్నాలజీ వినియోగంలో విశాఖను ఒక హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఎస్‌టీపీఐ, నాస్కామ్‌లతో పాటు పలు సంస్థలు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వీటి ద్వారా నూతన టెక్నాలజీలో మరిన్ని ఆవిష్కరణలకు విశాఖ వేదిక కానుంది. 
- మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

ఏడాదిలో స్టార్టప్స్‌ రెట్టింపు
కీలకమైన రెండు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు కావడం ద్వారా విశాఖ నగరం స్టార్టప్‌ హబ్‌గా మారనుంది. తెలంగాణలో టీ–హబ్‌ మాదిరిగా ఇండస్ట్రీ–4 సీవోఈకి భారీ డిమాండ్‌ వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 100 వరకు స్టార్టప్‌లు ఉండగా ఏడాది వ్యవధిలో  రెండు రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం.  
– శ్రీధర్, ప్రెసిడెంట్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ(ఐటాప్‌) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top