సాక్షి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 21వ డివిజన్‌లో తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగింది. ఎన్‌ఎస్‌ఎం స్కూల్ నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పెద్ద ఎత్తున వృద్ధులు పాల్గొన్నారు. రెండేళ్లుగా కొత్త పింఛన్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేయడం లేదు.. పాత పింఛన్లు సైతం తొలగించింది. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
నమ్మించి చంద్రబాబు మోసం చేశారు: దేవినేని అవినాష్
వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ హయాంలో ఉన్న పింఛన్లు కూటమి ప్రభుత్వం తొలగించింది. దీనిపై జోనల్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందచేశాం. చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పథకం కూడా అమలు చేయటం లేదు. మహిళలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. చంద్రబాబు వారిని మోసం చేశారు. ప్రభుత్వ అసమర్థతపై ఈనాడు పేపర్‌లోనే వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుంది?.
పింఛన్లు తీసివేస్తే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏమి చేస్తున్నాడు? వైఎస్సార్‌సీపీ హయాంలో ఏమి జరగక పోయిన గగ్గోలు పెట్టిన గద్దెకు ఇప్పుడు కళ్ళు కనపడటం లేదా?. అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు తొలగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. షో చేయటానికి చంద్రబాబు.. పింఛన్లు లబ్ధిదారులకు స్వయంగా ఇస్తున్నారు
ప్రచార ఆర్భాటాలు తప్ప.. అమలు లేదు: వెల్లంపల్లి శ్రీనివాస్
కూటమి హయాంలో అన్ని రకాల పింఛన్లు తొలగించారు. వైఎస్ జగన్ హయాంలో పింఛన్ల సంఖ్య పెంచారు. పింఛన్లు పెంచి ఇస్తున్నామని ప్రచార ఆర్భాటాలు తప్ప అమలు లేదు. దివ్యాంగులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 50 సంవత్సరాలు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తాం అని మాట ఇచ్చి తప్పారు. కొత్తగా ఎవరికీ శాంక్షన్ చేయటం లేదు. సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం అనేది అబద్ధం. మహిళలను నమ్మించి చంద్రబాబు మోసం చేశారు. ఏ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదు.
అయినా చంద్రబాబుకి చలనం లేదు: మల్లాది విష్ణు
విజయవాడలో తొలగించిన పింఛన్లు విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇదే వైఖరి అవలంబిస్తుంది. వైఎస్ జగన్ నవరత్నాలు అమలు చేసే వాస్తవాలు చెప్పేవారు. 33 లక్షల నూతన పింఛన్లు వైఎస్ జగన్ నాలుగేళ్లలో ఇచ్చారు. అర్హత ఉన్న వారు అందరికీ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాలి. మీ పత్రికలే వాస్తవాలు చెబుతున్నాయి అయినా చంద్రబాబుకి చలనం లేదు. విజయవాడలో ఉన్న అన్ని శాఖలు ప్రజల ఆదరణ కోల్పోయాయి. ఇసుక, బూడిద, మట్టి ప్రసాదం లాగా కూటమి నేతలు తినేస్తున్నారు.


