విజిలెన్స్‌ విస్తృత దాడులు

Vigilance widespread attacks on Illegals Andhra Pradesh - Sakshi

రెండు నెలల్లోనే 10,015 దాడులు.. 2,891 కేసులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమార్కులపై విజిలెన్స్‌ విభాగం కొరడా ఝళిపిస్తోంది. సామాన్యులు, అన్నదాతలకు అండగా నిలుస్తోంది. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నవారిపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. అలాగే కల్తీలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు నెలల్లోనే 10,015 దాడులు నిర్వహించడంతోపాటు 2,891 కేసులను నమోదు చేసింది.

ఇక వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కానుండటంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలు, నకిలీ దందాల కట్టడికి కూడా రంగంలోకి దిగింది. అంతర్జాతీయ పరిణామాలు, పంటల సీజన్‌ పరిస్థితులను సావకాశంగా తీసుకుని అక్రమార్కులు సామాన్యులు, రైతులను దోపిడీ చేయకుండా విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించింది.

ఉక్రెయిన్‌–రష్యా యుద్ధ పరిస్థితులను సాకుగా చూపించి.. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేయడం, ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయించడాన్ని గుర్తించింది. రాష్ట్రంలో అందుకు అవకాశం లేకుండా కట్టడి చేసేందుకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తోంది.

ఇక కల్తీ విత్తనాలు, ఎరువుల కట్టడికి విజిలెన్స్‌ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. అక్రమాలకు పాల్పడినవారిని గుర్తించి నిత్యావసర వస్తువుల చట్టం, తూనికలు–కొలతల చట్టం, ఆహార భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. తీవ్ర నేరాలకు పాల్పడినవారిపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తుండటంతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. 


తిరుపతిలో వంటనూనెల దుకాణంలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీ    

10,015 దుకాణాలు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు..
విజిలెన్స్‌ అధికారులు రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 6 నుంచి మే 17 వరకు ఏకంగా 10,015 దుకాణాలు, వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన 2,891 దుకాణాలు, వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. వాటిలో తూనికలు–కొలతల చట్టం కింద 2,689 కేసులు, నిత్యావసర వస్తువుల చట్టం కింద 71 కేసులు, ఆహార భద్రతా చట్టం కింద 113 కేసులతోపాటు 18 క్రిమినల్‌  కేసులు ఉన్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 515 కేసులు నమోదు కాగా అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. 

అక్రమ రవాణా మార్గాలపై దృష్టి
గతంలో లేని విధంగా నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు, అక్రమ రవాణా మార్గాలపై విజిలెన్స్‌ దృష్టి సారించింది. కర్ణాటకలో నకిలీ విత్తనాలు తయారుచేసే ముఠాలు వ్యవస్థీకృతమైనట్టు.. అక్కడి నుంచే రాష్ట్రంలోకి తరలిస్తున్నట్టుగా గుర్తించింది. దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలపై విజిలెన్స్‌ అధికారులు పటిష్ట నిఘా పెట్టారు.

కర్ణాటక నుంచి విత్తనాలు కొనుగోలు చేసే వారిపై దృష్టిసారించారు. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల దుకాణాలపై రెండు రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండురోజుల్లోనే 100 దుకాణాలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన 12 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. 

అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం..
వంట నూనెలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలను అడ్డుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ.. ధరలను అమాంతంగా పెంచేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇక వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కానుండటంతో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను విక్రయించకుండా తనిఖీలు ముమ్మరం చేశాం. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
– శంకబ్రత బాగ్చి, అదనపు డీజీ, విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌

జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా విజిలెన్స్‌– ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తమ జిల్లా యూనిట్లను ఇంకా పునర్వ్యస్థీకరించలేదు. పాత 13 జిల్లాల యూనిట్ల వారీగా విజిలెన్స్‌ అధికారులు నిర్వహించిన దాడులు, నమోదు చేసిన కేసుల వివరాలు.. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top