
అదును ముంచుకొస్తున్నా అన్నదాతలకు అందని విత్తనం
పెట్టుబడి సాయం లేదు.. ఆదుకుందామన్న చిత్తశుద్ధీ లేదు
సబ్సిడీ విత్తన సరఫరాలో సర్కార్ ఘోరంగా విఫలం
ప్రశ్నార్థకంగా మారిన వరి, వేరుశనగ, ఇతర విత్తనాల పంపిణీ
వైఎస్ జగన్ హయాంలో ఈ సమయానికే విత్తన పంపిణీ మొదలయ్యేదని గుర్తుచేసుకుంటున్న రైతులు
2024–25 సీజన్ విత్తన బకాయిలు రూ.328.75 కోట్లు
ఆయా కంపెనీలకు పైసా విదల్చని టీడీపీ కూటమి ప్రభుత్వం
ఆ బకాయిలు చెల్లిస్తే తప్ప విత్తనాలు సరఫరా చేయలేమంటున్న కంపెనీలు
జగన్ హయాంలో అందుబాటులో 6.63 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు.. ఇప్పుడు 3 లక్షల క్వింటాళ్లకు మించవని అంచనా
దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులు.. గత ప్రభుత్వంలో సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం, సకాలంలో విత్తనాలు
గతంలో ఈపాటికే విత్తనాలిచ్చారు
నాకు నాలుగెకరాలు సొంత భూమి ఉంది. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వేరుశనగ సాగు చేస్తున్నా. గతంలో ఈ పాటికే విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాదు. విత్తనాలు పంపిణీ కూడా పూర్తయ్యేది. ఈ ఏడాది రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. విత్తనాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పే నాథుడు లేడు. బయట మార్కెట్‌లో కొందామంటే ధరలు మండిపోతున్నాయి. పైగా నాణ్యమైనవి దొరుకుతాయో లేదో తెలియడం లేదు. – బోయ ఓబులేసు, ఉదిరిపికొండ, కూడేరు మండలం, అనంతపురం జిల్లా
⇒ ఇతని పేరు బొంతల హరీష్. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లె గ్రామం.
సొంతంగా మూడెకరాలు, కౌలుకు రెండెకరాలు.. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్నాడు. 15 ఏళ్లుగా వేరుశనగ పంట వేస్తున్నాడు. ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనం కావాలి. బహిరంగ మార్కెట్‌లో క్వింటా రూ.12 వేలకు పైగానే ఉంది. ఐదెకరాలకు రూ.60 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే పరిస్థితి ఇతనికి లేదు. గత ఖరీఫ్‌లో మే మొదటి వారంలోనే విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇచ్చారు. గతేడాది ఈపాటికే విత్తుకోవడం పూర్తయింది.
పంట ఏపుగా ఎదిగినా కోతకొచ్చే సమయానికి వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఐదెకరాలకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. రూ.60 వేలకుపైగా నష్టపోయాడు. రబీలో పంట వేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వర్షాలు పడుతుండడంతో అదును దాటిపోకుండా విత్తుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లినా రిజి్రస్టేషన్ చేసుకోవడం లేదని, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరి పరిస్థితి ఈ విధంగానే ఉంది.
సాక్షి, అమరావతి: అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. అదును సమయంలో వారికి పెట్టుబడి సాయం అందించకపోగా, సబ్సిడీ విత్తనాలు సైతం ఇవ్వకుండా కష్టాలపాలు చేస్తోంది. మరో పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతున్నా, విత్తన సరఫరా మొదలు కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీకి గతేడాది మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది సబ్సిడీ విత్తన పంపిణీలోనూ రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. దాదాపు ఆరు రకాల సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపి వేయడమే కాకుండా, మిగిలిన సబ్సిడీ విత్తనాల పంపిణీలోనూ అడ్డగోలుగా కోత పెట్టింది.
గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ విత్తన సరఫరా చేయలేమని ఓ వైపు కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది సబ్సిడీ విత్తనాలు రైతులకు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తప్పు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ఏటా వ్యవసాయ సీజన్‌కు ముందే తొలి విడత పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఎవరికి ఏ మేరకు విత్తనం కావాలో ముందుగానే ఆర్డర్ తీసుకుని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పెట్టుబడి సాయం రూ.13,500 కాకుండా ఏకంగా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం తమను మభ్యపెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా సబ్సిడీ విత్తనం లేదు.. పెట్టుబడి సాయమూ లేదని ఊరూరా అన్నదాతలు బావురుమంటున్నారు.
ఇంకా ఖరారు కాని సబ్సిడీలు
⇒ ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 86.47 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 38.87 లక్షల ఎకరాల్లో వరి, 14.30 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.10 లక్షల ఎకరాల్లో పత్తి, 9.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా 40% సబ్సిడీపై వేరుశనగ, 30% సబ్సిడీపై పెసర, మినుము, కంది, 50% సబ్సిడీపై కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి చిరుధాన్యపు విత్తనాలను సరఫరా చేస్తుంటారు.
⇒ వరి విత్తనాలను మాత్రం జాతీయ ఆహార ధాన్యాల భద్రతా పథకం అమలయ్యే జిల్లాల్లో కిలోకి రూ.10, ఇతర జిల్లాల్లో రూ.5 చొప్పున రాయితీతో సరఫరా చేస్తారు. ఏజెన్సీ జిల్లాలో మాత్రం 90% సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్ధేశించిన సాగు లక్ష్యాలకనుగుణంగా జిల్లాల వారీగా ఇండెంట్ సేకరిస్తారు.
⇒ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ఉత్పత్తి అయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన విత్తనాల కోసం టెండర్ల ద్వారా కంపెనీలను ఎంపిక చేస్తారు. ఇలా సేకరించిన విత్తనాలను ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లలో సర్టీఫై చేసి, సీజన్‌కు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రైతులకు అందుబాటులో ఉంచేవారు. సాధారణంగా ఏటా ఏప్రిల్‌లో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ పూర్తి చేసేవారు.
⇒ షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేసేవారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క ఏడాది ఒక్కరంటే ఒక్క రైతు కూడా తమకు విత్తనం సకాలంలో అందలేదన్న మాట విని్పంచకుండా సరఫరా చేశారు. ఈ ఏడాది అదును ముంచుకొస్తున్నప్పటికీ విత్తన పంపిణీ షెడ్యూల్ కాదు కదా.. కనీసం సబ్సిడీలను కూడా ఖరారు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని రైతులు మండిపడుతున్నారు.
సబ్సిడీ విత్తనంలో అడ్డగోలుగా కోత
⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తుగా చేసిన ఏర్పాట్ల ఫలితంగా 2024–25 ఖరీఫ్‌లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనం రైతులకు అందుబాటులో ఉండింది. వరి 2.29 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 3.16 లక్షల క్వింటాళ్లు, 94 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 15 వేల క్వింటాళ్ల అపరాల విత్తనాలను సీజన్‌కు ముందుగానే సర్టీఫై చేసి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచగలిగారు.
⇒ ప్రస్తుత ఖరీఫ్–2025 సీజన్ కోసం జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం తొలుత 6,31,952 క్వింటాళ్ల విత్తనం అవసరమని ఏపీ సీడ్స్ అంచనా వేసింది. ప్రధానంగా 2.37 లక్షల క్వింటాళ్ల వరి, 2.95 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 12 వేల క్వింటాళ్ల కందులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సబ్సిడీ విత్తనాన్ని కుదించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కేవలం 5.18 లక్షల
క్వింటాళ్లకు పరిమితం చేశారు.
⇒ ఇందులో 2.15 క్వింటాళ్ల విత్తనం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా, మిగిలిన విత్తనాన్ని టెండర్ ప్రక్రియ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. చివరికి 4.65 లక్షల క్వింటాళ్లకు మించి అమ్మకాలు ఉండవన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా గతంలో దాదాపు 16 రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేవారు. అలాంటిది ఈ ఏడాది 10 రకాలకే పరిమితం చేశారు. ఈ లెక్కన 3 లక్షల క్వింటాళ్లకు మించి విత్తనాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.
⇒ పిల్లిపెసర సహా సామెలు, ఊదలు, అలసందలు, రాజ్మా, ఉలవల సరఫరా నిలిపివేశారు. మిగిలిన వాటికి కూడా అడ్డగోలుగా కోత వేశారు. రాయలసీమ జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగ పంట కోసం గతంలో ఏటా దాదాపు 3.80 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనం అందుబాటులో ఉంచేవారు. అలాంటిది ఈ ఏడాది తొలుత 2.95 లక్షల క్వింటాళ్లు అవసరమని అంచనా వేయగా, ఆ తర్వాత ప్రభుత్వాదేశాలతో 1.95 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేయడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బకాయిలు చెల్లించని కూటమి ప్రభుత్వం
⇒ గతంలో ఏటా క్రమం తప్పకుండా సీజన్‌కు ముందుగానే టెండర్ల ద్వారా విత్తనాలకు అవసరమైన మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించడమే కాకుండా ఆ మొత్తాన్ని ఆయా కంపెనీలకు విడుదల చేసేవారు. దీంతో గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏనాడు విత్తన సరఫరాలో ఎలాంటి ఆటంకం ఏర్పడ లేదు. 2024–25 ఖరీఫ్ సీజన్‌లో 6.63 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయగా, అందుకు సంబంధించిన సబ్సిడీ రూ.328.75 కోట్లు ప్రభుత్వం కంపెనీలకు చెల్లించలేదు.
⇒ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.213.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలుగా ఈ మేరకు పలుమార్లు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలు.. వేరుశనగ, వరి, శనగ, ఉలవలు, రాజ్మా తదితర విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన 12 కంపెనీలు గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ ఈ ఏడాది విత్తన సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో యంత్రాంగం ఉంది.
⇒ అతికష్టమ్మీద ఒత్తిడి తీసుకురాగా జీలుగు.. జనుము (పచ్చిరొట్ట) విత్తనాలు కేవలం 23 వేల క్వింటాళ్లు (25%) జిల్లాలకు సరఫరా చేయగలిగారు. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఈ పాటికే ప్రారంభం కావాల్సిన వేరుశనగ విత్తనం పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. మిగిలిన విత్తనాల పంపిణీ పరిస్థితి కూడా అలాగే ఉంది.
⇒ ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వ చేతకాని తనం వల్ల నకిలీ విత్తనాలు రాజ్యమేలాయి. ఖరీఫ్‌లో ఎక్కువగా సాగయ్యే మిరప, పత్తి విత్తనాల్లో నకిలీలకు చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 40 కంపెనీలతో ఒప్పందం చేసుకుని, కల్తీలకు ఆస్కారం లేని రీతిలో రైతులు కోరుకున్న కంపెనీలకు చెందిన నాన్ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. గత సీజన్ నుంచి నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది.
విత్తనోత్పత్తికీ రాంరాం
⇒ సాధారణంగా సాగు విస్తీర్ణంలో 30 శాతం విస్తీర్ణానికి అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఆ మేరకు అవసరమైన విత్తనం కోసం రబీ సీజన్‌లో జిల్లాల వారీగా గుర్తించిన రైతులకు విత్తనోత్పత్తి పథకం కింద 75 శాతం రాయితీపై మూల విత్తనాన్ని ఇచ్చి విత్తన సాగును ప్రోత్సహిస్తారు. మరొకవైపు ఏపీ సీడ్స్‌లో వాటాదారులుగా ఉన్న రైతులకు బ్రీడర్స్, ఫౌండేషన్ సీడ్స్ ఇచ్చి వారి ద్వారా విత్తనోత్పత్తి చేసి, ఆ విత్తనాన్ని ఖరీఫ్ సీజన్‌లో రైతుల డిమాండ్ మేరకు సేకరిస్తారు.
⇒ సాధారణంగా ఏపీ సీడ్స్ సరఫరా చేసే విత్తనంలో 50 శాతం ఈ విధంగా సేకరిస్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే విత్తనం ఉత్పత్తి చేస్తారో ఆ రైతుల నుంచే ఈ–క్రాప్ ప్రామాణికంగా సేకరించేవారు. నిర్ధేశిత గడువులోగా వారికి బహిరంగ మార్కెట్ ధర కంటే 20–30 శాతం అదనంగా చెల్లించేవారు. ఈ వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో సైతం ప్రదర్శించేవారు.
⇒ దీంతో విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గడిచిన ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి చేసే రైతుల నుంచి సేకరించిన విత్తనాలకు సంబంధించిన బకాయిలు దాదాపు 9 నెలలు గడిచినా చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రైతులెవ్వరూ తమ విత్తనాన్ని ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. బహిరంగ మార్కెట్ ధరలకే అమ్ముకుంటున్నారు. దీంతో ఏపీ సీడ్స్ పూర్తిగా టెండర్ల ద్వారానే విత్తనం సేకరించాల్సిన దుస్థితి ఏర్పడింది.
అధికార పార్టీ ఎమ్మెల్యేలే పెదవి విరుపు
⇒ విత్తన పంపిణీ విషయంలో ప్రభుత్వ తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అధికార పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాసిన లేఖే నిదర్శనం.
⇒ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 3 లక్షల క్వింటాళ్ల విత్తనం అందించారని ఆమె గుర్తు చేశారు. అలాంటిది ఖరీఫ్–2025 సీజన్‌కు కనీసం 2 లక్షల క్వింటాళ్ల విత్తనం తక్కువ కాకుండా కేటాయించాల్సి ఉండగా, కేవలం 1.10 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టడం దారుణం అన్నారు. వ్యవసాయ శాఖ కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే కేటాయించడం విస్మయానికి గురి చేస్తోందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇదేనా మంచి ప్రభుత్వం అంటే?
సబ్సిడీపై వేరుశనక్కాయల విత్తనాల గురించి సచివాలయానికి వెళ్లి అడిగితే తమకు ఆదేశాలు రాలేదంటున్నారు. పదెకరాల్లో సేద్యం చేసుకున్నా.. వర్షాలు పడుతున్నాయి.. త్వరలో విత్తుకోవాల్సి ఉందని చెప్పినా వినిపించుకునే వారే లేరు. మాది రైతు ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం అంటున్నారు.. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? రైతు సేవా కేంద్రాల్లో మా పేర్లు కూడా నమోదు చేసుకోకపోవడం దారుణం. దీంతో విత్తనాలు అధిక ధరకు బయట కొనుక్కోవాల్సి వస్తోంది. – మునిరెడ్డి, బొందిమడుగుల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా
అన్ని విధాలుగా మోసం
చేల్లో దుక్కి దున్నాం. ఇంత వరకు శనగ విత్తనాలు రాలేదు. సచివాలయంలో అడిగితే మాకు పై నుంచి ఆర్డర్స్ రాలేదంటున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈపాటికే శనక్కాయల విత్తనాలు ఇచ్చేది. కానీ ఈ ఏడాది ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. అదును దాటిపోతుంది. ఇంకెప్పుడు విత్తుకోవాలి? పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. రైతులను అన్ని విధాలుగా ముంచేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 90 శాతం సబ్సిడీపై శనక్కాయల విత్తనం ఇవ్వాలి. – రమణారెడ్డి, పొడరాగపల్లి, ముదిగుబ్బ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా
కౌలురైతులకు నూరు శాతం సబ్సిడీతో సర్టీఫైడ్ విత్తనాలివ్వాలి
ఏపీ కౌలురైతుల సంఘం డిమాండ్
సాక్షి, అమరావతి: కౌలురైతులకు నాణ్యమైన, సర్టీఫై చేసిన విత్తనాలను నూరు శాతం సబ్సిడీపై అందించాలని ఏపీ కౌలు రైతుల సంఘం ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రైవేట్ మార్కెట్లో విత్తనాల ధరలు విపరీతంగా పెంచేశారని, పైగా ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాల్లో నాణ్యత ఉండటం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్య పేర్కొన్నారు. ఈ ఏడాది సీజన్‌కు ముందు విత్తనాలను సిద్ధం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.